
హోటల్‌లో బూజు పట్టిన చట్నీ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది. అధికారులు చూసిచూడనట్లు వ్య వహరిస్తుండడంతో జిల్లా కేంద్రంలోని కొందరు హోటళ్ల నిర్వాహకులు అపరిశుభ్ర వాతావరణంలోనే నిర్వహించడంతో పాటు నిల్వ ఉండి, ఫంగస్ వచ్చిన పదార్థాలనే వినియోగిస్తున్నారు. కొద్దిరోజులుగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను అరికట్టడానికి తనిఖీలు చేపడుతున్న కేఎంసీ శానిటేషన్ ఉద్యోగులు గురువారం రాపర్తినగర్ వద్ద ఓ టిఫిన్ సెంటర్‌లో పరిశీలించారు. శానిటరీ సూపర్‌వైజర్ ఎం.సాంబయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తనిఖీల్లో పాల్గొనగా ఆ హోటల్‌లోని ఫ్రిడ్జ్ తలుపులకు ఫంగస్ రాగా, నిల్వ ఉన్న చట్నీలోనూ బూజు వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు హోటల్ నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించి, తీరు మార్చుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే, పలు షాపుల్లో నిషేధిత ప్లాస్టిక్‌ను సీజ్ చేసి పది దుకాణదారులకు రూ.42వేల జరిమానా విధించారు.
నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా