
ఎకరాకు 300గజాల ప్లాట్
టీటీడీ ఆలయ నిర్మాణానికి
సహకరించాలి
ఖమ్మంఅర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యాన ఖమ్మంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అసైన్డ్ భూములు కలిగిన రైతులు సహకరించాలని అర్బన్ తహసీల్దార్ దొడ్డారపు సైదులు కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆయన అల్లీపురం, కొత్తగూడెం రైతులతో సమావేశమయ్యారు. ఆలయ నిర్మాణ అవసరాలకు రైతులు భూమి ఇస్తే ఎకరాకు 300 గజాల చొప్పున అదే ప్రాంతంలో అన్ని వసతులతో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను అమ్మడం, కొనడానికి హక్కు ఉండదని చెప్పారు. కానీ ఇందుకు బదులుగా ఇచ్చే ప్లాట్లపై పూర్తి హక్కులు లభిస్తాయని భరోసా కల్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో టీటీడీ ఆలయ నిర్మాణానికి నిర్మాణం చేపట్టనుందని.. తద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించనున్నందున రైతులు సహకరించాలని తహసీల్దార్ కోరారు. ఈసమావేశంలో వీ.వీ.పాలెం సొసైటీ అధ్యక్షుడు రావూరి సైదుబాబు, నాయకులు వెనిగండ్ల సత్యనారాయణ, సంక్రాంతి నాగేశ్వరరావు, బర్ల కోటేశ్, రవి, గద్దల రాంబాబు, ఫ్రాన్సిస్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.