
పాడిసంపదతో రైతుల ఆర్థికాభివృద్ధి
కల్లూరురూరల్/ఖమ్మంవ్యవసాయం: రైతులు వ్యవసాయం చేస్తూనే పాడి పశువుల పోషణ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించొచ్చని జిల్లా పశు సంవర్థక, పశువైద్యాధికారి బోడేపూడి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కల్లూరు మండలంలోని కొర్లగూడెంలో పశువులకు టీకాలు వేసిన ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 14 వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సకాలంలో టీకాలు వేయిస్తే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే పశువులు మేత తినక నీరసిస్తాయని, పాల దిగుబడి పడిపోతుందని తెలిపారు. ఈ మేరకు రైతులు తమ గేదెలు, దున్నలతో పాటు ఆవులు, ఎద్దులకు టీకాలు వేయించాలని సూచించారు. పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజ, పశువైద్యాధికారులు మమత, సఫియా, ఉద్యోగులు శ్రీనివాస్, కె.రామకృష్ణ, ఆమని, నయీమ్, శ్రీను, నాగరాజు, గోపాలమిత్ర పాల్గొన్నారు.