
పాఠశాలలకు క్యాలెండర్లు!
● నెలల వారీగా కార్యకలాపాల ముద్రణ ● పరీక్షలు, సెలవుల వివరాలతో రూపకల్పన ● సవివరంగా సమావేశాలు, ముఖ్య తేదీలు కూడా..
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్లను అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో వీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు ఇటీవలే క్యాలెండర్లు చేరగా.. 1,137 ప్రభు త్వ పాఠశాలలకే కాక కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈఓ కార్యాలయంతో పాటు ఎమ్మార్సీలు, పాఠశాలలకు అందించనున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు చేరిన ఈ క్యాలెండర్లను పాఠశాలలకు పంపిస్తున్నారు.
లక్ష్యం ఇలా..
పాఠశాల విద్యాశాఖ ప్రతీ విద్యార్థికి ఉచితంగా, సమానంగా, నాణ్యమైన విద్య అందేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రతీ విద్యార్థిలో పఠనం, లెక్కలు, శాసీ్త్రయ ఆలోచన, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాల్లో దృఢమైన పునాదులను ఏర్పర్చేలా కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధి కోసం 21వ శతాబ్దపు నైపుణ్యా లు, విలువలు, సామాజిక – భావోద్వేగ సౌఖ్యాన్ని పెంపొందించడమనే లక్ష్యాలను క్యాలెండర్లపై ముద్రించారు.
ఆకట్టుకునేలా క్యాలెండర్లు
ప్రభుత్వం పాఠశాలలకు అందిస్తున్న క్యాలెండర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. క్యాలెండర్‌పై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన రావడమే కాక రోజువారీ కార్యక్రమాలు అర్థమయ్యేలా రూపొందించారు. విద్యావిధానాన్ని తెలియజేస్తూనే ఒక్కో నెల పేజీపై నీతి సందేశం ముద్రించారు. పాఠశాల పనిదినాలు, పండుగలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, తల్లిదండ్రులు, పాఠశాల సముదాయ సమావేశాలు, సెలవులు, వైజ్ఞానిక ప్రదర్శనల వివరాలు కూడా పొందుపరిచారు. అలాగే, యోగా, ధ్యానం, బ్యాగ్‌లు లేకుండా పాఠశాలలకు వచ్చే వివరాలు కూడా ముద్రించారు.
గతంలో ఫోన్‌లోనే..
ఇప్పటివరకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు అకడమిక్ క్యాలెండర్‌ను ఫోన్‌లోనే పంపించే వారు. ఈసారి కొత్తగా ముద్రించి పంపిణీ చేస్తున్నారు. దీనిపై అన్ని వివరాలు ఉండడంతో ఏయే తేదీల్లో ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో తెలిసిపోతుంది.

పాఠశాలలకు క్యాలెండర్లు!