
విజయవాడలో కారేపల్లి వాసి ఆత్మహత్య
కారేపల్లి: కుటుంబ సమస్యల నేపథ్యాన ఓ వ్యక్తి విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారేపల్లి మండలం ఆలియాతండా గ్రామానికి చెందిన బానోతు హరిచందర్ (32) విజయవాడలో ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లో వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలు ఉండడంతో ఆవేదన చెందిన ఆయన విజయవాడలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మృతదేహాన్ని బుధవా రం స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, హరిచందర్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
రూ.74 వేల విలువైన గంజాయి స్వాధీనం
కామేపల్లి: ఒడిశా నుంచి గంజాయి తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. మండలంలోని ముచ్చర్ల క్రాస్ రోడ్డులో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా జాస్తిపల్లికి చెందిన పల్లపు వేణు, ముచ్చర్లకు చెందిన షేక్ యాసిన్ బైక్‌పై వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే యత్నం చేశారు. వారిని పట్టుకుని బ్యాగ్‌లో తనిఖీ చేయగా రూ.74,250 విలువైన 1.485 కేజీల గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒడిశాకు చెందిన అభి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారని తేలడంతో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
కడవరకూ తోడుగానే...
భర్త దశదిన కర్మలోగా భార్య మృతి
సత్తుపల్లిరూరల్: ఇటీవలే భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయనను తలుచుకుంటూ కన్నీరుము న్నీరుగా రోదిస్తున్న భార్య సైతం కన్నుమూసింది. భర్త దశదిశ కర్మ కు ఓ రోజు ముందే ఈ ఘటన జరగడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన నంధ్యాల పుల్లారెడ్డి (90) అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 2వ తేదీన మృతి చెందాడు. అప్పటినుంచి ఆయన భార్య సత్యవతి(80) నిద్రాహారాలు మాని రోదిస్తోంది. ఈ క్రమాన గురువారం పుల్లారెడ్డి దశదిన కర్మకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగానే, సత్యవతి బుధవారం ఉదయం కన్నుమూసింది. దీంతో ఆయన కుటుంబంతో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, పుల్లారెడ్డి దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

విజయవాడలో కారేపల్లి వాసి ఆత్మహత్య