
మహిళ, శిశు సంక్షేమమే లక్ష్యం
కల్లూరు: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే మహిళలు, శిశువుల సంక్షేమమే లక్ష్యంగా ఉద్యోగులు పని చేయాలని ఐసీడీఎస్ వరంగల్ ఆర్‌జేడీ ఝాన్సీలక్ష్మీబాయి సూచించారు. కల్లూరులో మంగళవారం నిర్వహించిన పోషణమాసం సమావేశంలో ఆర్‌జేడీ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులను నిరంతరం పరిశీలిస్తూ పోషకాహార లోపం ఎదురుకాకుండా చూడాలని తెలిపారు. గర్భిణీగా తేలగానే పేరు నమోదు చేసి సలహాలు ఇవ్వాలని చెప్పారు. అలాగే, చిన్నారులకు బోధన, తక్కువ ఖర్చుతో పోషకాహారం తయారీపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే రక్తహీనత సమస్య ఎదురుకాదని చెప్పారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీత్, సీడీపీఓ నిర్మలజ్యోతి, ఏసీడీపీఓ రత్తయ్య, సూపర్‌వైజర్లు సంధ్యారాణి, సుజాత, భవాని, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.