
మక్కల కొనుగోళ్లకు సిద్ధం
ఇప్పుడిప్పుడే మొదలవుతున్న కోతలు
మార్క్‌ఫెడ్‌తో కొనుగోళ్లకు
ప్రభుత్వ నిర్ణయం
త్వరలోనే జిల్లా పర్చేజింగ్ కమిటీల సమావేశాలు
సాగు ప్రాంతాల్లో కేంద్రాలు
రూ.2,400 మద్దతు ధర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో సాగైన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించేలా ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే పంట కోతలు జోరందుకుంటున్నాయి. వారం, పది రోజుల్లో కలెక్టర్ల ఆధ్వర్యాన జిల్లా పర్చేజింగ్ కమిటీల సమావేశాలు నిర్వహించి పంట సాగు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
భద్రాద్రి జిల్లాలో అత్యధికం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 98,554 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఇందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 96,864 ఎకరాల్లో సాగు చేయగా, ఖమ్మం జిల్లాలో కేవలం 1,690 ఎకరాల్లోనే సాగు చేశారు. భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, పినపాక, మణుగూరు, ఆళ్లపల్లి, పాల్వంచ, బూర్గంపాడు ప్రాంతాల్లో సాగు ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో నీటి వనరులు అధికంగా ఉండటంతో ఇతర పంటలు సాగవుతున్నాయి. యాసంగిలో మాత్రం ఖమ్మం జిల్లాలోనూ మొక్కజొన్న సాగు అధికంగా ఉంటుంది. కాగా, భద్రాద్రి జిల్లాలో పంట సాగు ఆధారంగా 2,42,160 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఏజెన్సీలో జోరుగా సాగు
భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంది. గుండాల మండలంలో అధికారికంగా 30వేల ఎకరాల్లో, అనధికారికంగా సుమారు 40వేల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అంచనా. ఆళ్లపల్లి మండలంలో అధికారికంగా 15వేలు, అనధికారికంగా 20వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతంలో డ్వాక్రా మహిళలు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోళ్లు జరిగేవి. కానీ మూడేళ్లుగా మద్దతు ధర లేకపోవడంతో నిలిపివేశారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దే ధర ఎక్కువగా ఉండడంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం మద్దతు ధరను రూ.2,400కు పెంచింది. ప్రైవేట్ వ్యాపారులు మరింత పెంచితే రైతులు వ్యాపారులకే విక్రయించే అవకాశముంది. ప్రస్తుతానికై తే వ్యాపారులు రూ.2వేలలోపే కొనుగోలు చేస్తుండగా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతే రైతులు వస్తారని భావిస్తున్నారు.
23 కేంద్రాలకు ప్రతిపాదన
మొక్కజొన్న రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయించనుంది. ఈమేరకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వాన జిల్లా స్థాయి పర్చేజింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. పంట సాగు ఆధారంగా భద్రాద్రి జిల్లాలో 20, ఖమ్మం జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆయా కేంద్రాల్లో సుమారు 30శాతం పంటను కొనుగోలు చేసే అవకా శముందని సమాచారం. మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో పీఏసీఎస్‌లు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా మక్కల కొనుగోళ్ల ప్రక్రియ చేపడతారు.
ఉమ్మడి జిల్లాలో 98,554 ఎకరాల్లో సాగు
ఉమ్మడి జిల్లాలో మక్కల
కొనుగోళ్లకు చర్యలు
మొదలయ్యాయి. పర్చేజింగ్ కమిటీ సమావేశాల
అనంతరం ప్రక్రియ మొదలవుతుంది. పంట సాగు ప్రాంతాల్లో కొనుగోలు
కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ.2,400 మద్దతు ధరతో కొనుగోళ్లు ఉంటాయి. – సునీత, మేనేజర్,
మార్క్‌ఫెడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా
గత ఏడాది క్వింటా మొక్కజొన్నలకు రూ.2,225 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.2,400గా ప్రకటించింది. వానాకాలంలో సాగు చేసిన మొక్కజొన్న కోతలు మొదవుతుండగా.. రైతులు తేమ తగ్గేలా కల్లాల్లో ఆరబోస్తున్నారు. అయితే, ప్రభుత్వ కొనుగోళ్లు మొదలుకాకపోవడంతో కొన్నిచోట్ల వ్యాపారులు క్వింటాకు రూ.2 వేల లోపే ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈనేపథ్యాన మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతే రైతులకు లాభం జరగనుంది.

మక్కల కొనుగోళ్లకు సిద్ధం