
జిల్లాలో వికసిత్ భారత్ పాదయాత్ర
ఖమ్మం రాపర్తినగర్: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ‘మై భారత్’ నేతృత్వంలో వికసిత్ భారత్ పేరిట పాదయాత్ర నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. ఖమ్మంలోని కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశమంతా పాదయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో త్వరలోనే మూడు రోజుల పాటు నుంచి యాత్ర ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https//mybharta.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, జిల్లా అధికారి ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెండో పంటగా
అపరాలతో లాభాలు
వైరా: పత్తి, వరి సాగు చేస్తున్న రైతులు రెండో పంటగా అపరాలు సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యాన మంగళవారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేటివ్ డీన్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్, మధిర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రుక్ష్మిణీదేవి, కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ సుచరితాదేవి మాట్లాడారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. అలాకాకుండా భూమిలో దున్నితే భూసారం పెరిగి రైతులపై ఎరువుల భారం తగ్గుతుందని తెలిపారు. ఆతర్వాత పంటలను ఆశిస్తున్న చీడపీడలు, వాటి నివారణ, మధిర ఏఆర్‌ఎస్ ద్వారా అందుబాటులో ఉన్న వంగడాలు, కేవీకే ద్వారా అందే సేవలను వివరించారు. వైరా ఏడీఏ టి.కరుణశ్రీ, రైతులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్లాట్ బుకింగ్‌తోనే
పత్తి కొనుగోళ్లు
కామేపల్లి: పత్తి సాగుచేసిన రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని, తద్వారా సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లకు అవకాశముంటుందని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. మండలంలోని మద్దులపల్లిలోని పత్తి చేన్లను మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. రైతులు పత్తితీత విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. ఏఓ తారాదేవి, రైతులు పాల్గొన్నారు.
‘నవోదయ’ దరఖాస్తు గడువు పెంపు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్లస్ వన్(11వ తరగతి)లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్ష కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో వికసిత్ భారత్ పాదయాత్ర