
రెండో విడత పుస్తకాలు రెడీ..
● జిల్లాకు చేరిన 1,54,650 పార్ట్–2 పుస్తకాలు ● సాఫీగా సాగనున్న బోధన
ఖమ్మంసహకారనగర్: గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడం ప్రహసనంలా సాగేది. విద్యార్థులు, నాయకులు తరచూ ఆందోళనలు చేపట్టాల్సి వచ్చేది. కొన్నిచోట్ల విద్యాసంవత్సరం మొదలయ్యాక రెండు, మూడు నెలలు గడిచినా అన్ని సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు వచ్చేవి కాదు. కానీ కొన్నాళ్లుగా అలాంటి ఇక్కట్లు లేకుండా పుస్తకాలు అందుతున్నాయి. గత రెండేళ్లుగా పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తుండగా.. ఈసారి పార్ట్–2 పాఠ్య పుస్తకాలు సైతం సకాలంలోనే జిల్లాకు చేరుతున్నాయి.
ఒకే పుస్తకం.. రెండు భాగాలు
రాష్ట్ర ప్రభుత్వం పార్ట్–2 పాఠ్య పుస్తకాలను జిల్లాకు చేరవేయడం మొదలుపెట్టింది. తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు కలిపి ఒకే సబ్జెక్టు పుస్తకాన్ని రెండు భాగాలుగా ముద్రిస్తున్నారు. ఓ పక్క తెలుగు, మరోపక్క ఇంగ్లిష్‌లో ముద్రించాల్సి రావడంతో రెండేళ్ల నుంచి ఈ విధానం అమలుచేస్తున్నారు. పార్ట్–1 పాఠ్య పుస్తకాలు ఏప్రిల్ నెలాఖరులోనే జిల్లాకు చేరగా పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు పంపిణీ చేశారు. వీటి ఆధారంగా బోధన చివరి దశకు చేరడంతో పార్ట్–2 పుస్తకాలు చేరవేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు 1,303 ఉండగా సుమారు 68వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వీరికి పార్ట్–2 పుస్తకాలు 1,66,600 అవసరమని జిల్లా అధికారులు నివేదిక సమర్పించారు. ఇందులో ఇప్పటికే 1,54,650 పాఠ్య పుస్తకాలు చేరగా, ఎమ్మార్సీలకు తరలించి అక్కడి నుంచి పాఠశాలలకు పంపిస్తున్నారు.
తీరనున్న ఇక్కట్లు
విద్యార్థులకు విద్యాసంవత్సరం మొదటల్లోనే పార్ట్–1 పాఠ్య పుస్తకాలు అందగా బోధన సాఫీగా సాగింది. వీటి ఆధారంగా బోధన చివరి దశకు చేరుతుండగానే పార్ట్–2 పుస్తకాలు పంపిస్తున్నారు. త్వరలోనే ఈ పుస్తకాలు ఎమ్మార్సీల నుంచి పాఠశాలలకు, అక్కడి నుంచి విద్యార్థులకు అందుతాయి. దీంతో పాఠ్య పుస్తకాల కొరత లేకుండా బోధన జరుగుతుందని చెబుతున్నారు.