
పార్టీ క్రమశిక్షణే ప్రామాణికం
ఖమ్మంరూరల్/కూసుమంచి: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు పార్టీలో క్రమశిక్షణగా ఉండడమే ప్రధాన అర్హత అని ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవిపై పాలేరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించేందుకు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి, కూసుమంచిలో మంగళవారం సమావేశాలు నిర్వహించారు. నాలుగు మండలాల పార్టీ శ్రేణులు హాజరైన ఈ సమావేశాల్లో మహేంద్రన్ మాట్లాడారు. పార్టీ భవిష్యత్‌కు తోడు క్రమశిక్షణే ఆధారంగా అధ్యక్ష పదవి ఎంపిక ఉంటుందని తెలిపారు. ఈ క్రమాన అందరికీ ఆమోదయోగ్యమైన నేతను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అనంతరం మండలాల వారీగా నాయకులను ఒక్కరొక్కరుగా పిలిచి అభిప్రాయాలు సేకరించారు. మొదటి నుండి కాంగ్రెస్‌ను అట్టిపెట్టుకుని, అధికారం ఉన్నా, లేకున్నా కొనసాగుతున్న నాయ కుల వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఈమేరకు డీసీసీ అధ్యక్ష పదవి కోసం మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్‌బాబు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకుని పార్టీలో తమ పాత్రను వివరించారు. ఇంకా ఈసమావేశాల్లో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ పరిశీలకుడు చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్ష ఎంపికపై
ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్