
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య?
తల్లాడ: మండలంలోని మల్సూర్‌తండాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ(19) ఇంటి వద్ద నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. దీంతో ఆయనను ఖమ్మంలోని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాగా, ప్రేమ విఫలం కావడంతోనే మణికంఠ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు తల్లాడ ఎస్‌ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యాన విచారణ చేస్తున్నారు.
యువకుడిపై పోక్సో కేసు
ఖమ్మంక్రైం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం జహీర్‌పుర ప్రాంతానికి చెందిన గోపి సుక్కు అదే ప్రాంతానికి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ మోహన్‌బాబు తెలిపారు.
గంజాయి రవాణాదారులపై పీడీ యాక్ట్
ఖమ్మంరూరల్: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన సిద్దిపేట జిల్లా మందపల్లికి చెందిన పల్లపు రఘు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం మండలం వెంకటాద్రికి చెందిన మహ్మద్ ఖాజా పాషాపై పీడీ యాక్టు కొనసాగిస్తున్నట్లు ఖమ్మంరూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. వీరిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరి 24న రూ.89లక్షల విలువైన 179 కేజీల గంజాయిని కారులో తరలించే క్రమాన కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ వద్ద పట్టుబడ్డారు. దీంతో వీరిని రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే, ఆగస్టు 26న రఘు, పాషాపై కూసమంచి సీఐ సంజీవ్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. వీరిపై పీడీ యాక్టు నమోదును తెలంగాణ అడ్వైజరీ కమిటీ బోర్డు ఆమోదించడంతో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఏసీపీ తెలిపారు.
చిరుతపులి గోర్ల తస్కరణ..
ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): చనిపోయిన చిరుతపులి గోర్లను తస్కరించిన వ్యక్తికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్త్రేట్ కే.సాయిశ్రీ సోమవారం తీర్పు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్బుగూడెం బీట్ పరిధిలో కంపార్ట్‌మెంట్–35 అటవీ ప్రాంతాన 2016 సంవత్సరంలో రెండు చిరుతపులులు రెండు మేకలపై దాడి చేసి హతమార్చాయి. దీంతో బాధిత రైతు మేకల కళేబరాలపై పురుగుల మందు చల్లాడు. వాటిని తిన్న రెండు చిరుతలు మృత్యువాత పడ్డాయి. ఈమేరకు అటవీశాఖ బీట్ ఆఫీసర్ రమేష్ బాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి, చిరుతపులి గోర్లను తస్కరించినట్లు గుర్తించారు. దీంతో అటవీశాఖ అధికారులు అబ్బుగూడెం గ్రామానికి చెందిన బూస సత్యం, పోతిని మంగయ్య, బూస హనుమంతరావు, కర్రి ఆశయ్య, ఎం.లక్ష్మారెడ్డి, ఎం.లక్ష్మయ్యపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ ఆరుగురిలో లక్ష్మయ్య కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. మిగిలిన వారిలో ఎం.లక్ష్మారెడ్డి నిందితుడిగా తేల్చిన కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగా, మిగిలిన వారిపై నేరం రుజువుకాలేదని కేసు కొట్టేసింది.