
తక్షణమే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ఖమ్మంమయూరిసెంటర్: పత్తి చేతికొస్తున్న నేపథ్యాన ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి రైతులను ఆదుకోవాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. సంఘం నాయకులు సోమవారం ఖమ్మం మార్కెట్‌లో పత్తి రైతుల సమస్యలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్, మార్కెట్ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా పత్తి రైతులను ఆదుకునేలా వెంటనే కొనుగోళ్లు మొదలుపెట్టాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ముందుకురాగానే ప్రభుత్వమే మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు, కోలేటి నాగేశ్వరరావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కమ్మకోమటి నాగేశ్వరరావు, కేలోతు లక్ష్మణ్, పాశం అప్పారావు, గుగులోత్ తేజనాయక్, కుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య