ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర

Oct 13 2025 7:36 AM | Updated on Oct 13 2025 7:36 AM

ఎస్సీ

ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర

ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై అతిపెద్ద రాజకీయ కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ రత్నాకర్‌ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్‌ పేరుతోనే దళితులకు సామాజిక న్యాయం జరుగుతుందా? అని, ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అవసరం లేదా..? అని ప్రశ్నించారు. పంజాబ్‌, హరియాణాలో తొలిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని, దానిని ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తం చేశాడని ఆరోపించారు. శాసీ్త్రయత లేని, రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్‌ వల్ల చాలా తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సమావేశంలో కామ ప్రభాకర్‌రావు, బల్లెం లక్ష్మణ్‌, మిరియాల బాలశౌరి, తోట దుర్గాప్రసాద్‌, కనికెళ్ల నాని, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

పీఈటీ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల కళాశాలల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్‌రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్‌ డైరెక్టర్‌), ఉపాధ్యక్షులుగా పి.అజయ్‌, ఎస్‌.కుమారస్వామి, బి.రమేశ్‌, జి.సునీత, కోశాధికారిగా ఎస్‌.కిరణ్‌కుమార్‌గౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్‌, బి.వెంకట్రామ్‌, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మహ్మద్‌ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది.

వడ్డీ వ్యాపారులకు

మావోయిస్టుల హెచ్చరిక

దుమ్ముగూడెం: అవసరాన్ని బట్టి పేద ప్రజల వద్ద పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులను హెచ్చరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అధిక వడ్డీలు కట్టలేని పరిస్థితిలో పేదలు ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలన్నారు. వ్యాపారుల దౌర్జన్యాలు తట్టుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొందరు చనిపోతున్నారని, మరికొందరు ఆస్తులు అమ్ముకుని రోడ్డుపై పడుతున్నారని తెలిపారు.

గైనకాలజిస్ట్‌లు లేక బాలింత కొత్తగూడెం తరలింపు

గర్భంలోనే శిశువు మృతి

మణుగూరుటౌన్‌: సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియా ఆస్పత్రిలో గైనికాలజిస్ట్‌లు లేక సరైన సమయంలో వైద్యం అందక గర్భంలోనే శిశువు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ఎర్రపు వినయ్‌ సివిల్‌ విభాగంలో జనరల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, భార్య స్వాతి 9 నెలల గర్భిణి. స్వాతికి తరచూ షుగర్‌ రావడంతో రోజూ క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ వేసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మణుగూరు సింగరేణి ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ లేకపోవడంతో భర్త వినయ్‌ కొత్తగూడెం మెయిన్‌ ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ క్రమంలో మణుగూరు ఆస్పత్రికి సాధారణ పరీక్షల కోసం వెళితే కొత్తగూడెం మెయిన్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారని అక్కడ గుండె చప్పుడు పరిశీలించిన వైద్యులు ప్రైవేట్‌ స్కాన్‌ చేయించగా, అప్పటికే శిశువు మృతి చెందిందని తెలిపారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ ఉంటే శిశువు ప్రాణం దక్కి ఉండేదని కన్నీటి పర్యంతమయ్యాడు.

ఆదివాసీలు ఉద్యమించాలి

టేకులపల్లి: ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు నిర్వహించిన కొమురం భీమ్‌ ఆశయ సాధనకు ఆదివాసీలు ఉద్యమించాలని తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్‌ కల్తి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో ఆదివా రం కొమురం భీమ్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్‌, జంగిల్‌, జమీన్‌ కావాలంటూ నైజాం నవాబులు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరు సల్పారని అన్నారు. భద్రాచలంలో జరిగిన ధర్మ యుద్ధం సభ సక్సెస్‌ కావడంతో కొందరు లంబాడీ నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణ  ఓ రాజకీయ కుట్ర 1
1/1

ఎస్సీ వర్గీకరణ ఓ రాజకీయ కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement