
పైరవీలకే పెద్దపీట..?
అవకతవకలెన్నో..
● టీచర్ల కేటాయింపుల్లో లోపాలున్నాయని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన ● ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
సత్తుపల్లి: పైరవీలు చేసినవారు, పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులను వారికి నచ్చిన స్థానాల్లో సర్దుబాటు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం డీఈఓగా ఐఏఎస్ అధికారిణి బాధ్యతల్లో ఉన్నప్పటికీ కొందరు ఎంఈఓలు తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులను ఏకంగా జిల్లా కేంద్రానికి సమీపంలో సర్దుబాటు చేశారనే చర్చ సాగుతోంది. దసరా సెలవుల ముందు సర్దుబాటు ప్రక్రియ చేపట్టి, ఉన్న ఫలంగా విధుల్లో చేరాలని ఉత్తర్వులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు విధుల్లో చేరినట్లు తెలిసింది. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో సర్దుబాటు, పైరవీలు, అవతవకలపై నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపించేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిని కలిసి సర్దుబాటులో లోపాలపై ఫిర్యాదు చేయగా మండల అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇన్‌చార్జ్ ఎంఈఓల పాఠశాలలకు..
సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న ఎంఈఓలందరూ ఇన్‌చార్జ్‌లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు కాకర్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్, వేంసూరు ఎంఈఓ చల్లంచర్ల వెంకటేశ్వరరావు చౌడారం హైస్కూల్, పెనుబల్లి ఎంఈఓ సత్తెనపల్లి సత్యనారాయణ వీఎం బంజర్ జెడ్పీహెచ్‌ఎస్‌ల్లో హెచ్‌ఎంలుగా పనిచేస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియలో వారు పనిచేస్తున్న పాఠశాలలకు ఇబ్బందులు రాకుండా ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పదో తరగతి ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై సత్తుపల్లి ఇన్‌చార్జ్ ఎంఈఓ రాజేశ్వరరావును వివరణ కోరగా.. ప్రభుత్వ జీఓ ప్రకారం సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేశామని, ఎలాంటి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు.
పెనుబల్లి మండలం కొండ్రుపాడు జెడ్పీహెచ్‌ఎస్ హిందీ ఉపాధ్యాయుడు గంగరాజును బోనకల్ మండలం ఆళ్లపాడు జెడ్పీహెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై పంపించారు. కోండ్రుపాడు పాఠశాలకు గణేశ్‌పాడు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై పంపించారు. అసలు కోండ్రుపాడు పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై ఎందుకు పంపారు? ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఎందుకు తెచ్చారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెనుబల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో అదనంగా ఉపాధ్యాయులు ఉన్నా.. ఎంఈఓ ఇన్‌చార్జ్ కావడంతో సర్దుబాటులో ఈ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించినట్లు విమర్శలు వస్తున్నాయి. వేంసూరు మండలం దుద్దేపూడి యూపీఎస్‌లో పనిచేస్తున్న రవికుమార్‌ను ఖమ్మం, యూపీఎస్ రామన్నపాలెంలో పనిచేస్తున్న బాలాజీని ఖమ్మం డిప్యూటేషన్‌పై పంపించారు. మార్గదర్శకాల ప్రకారం ఆ మండలంలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అదే మండలంలో సర్దుబాటు చేయాల్సి ఉన్నప్పటికీ జిల్లా కేంద్రానికి పంపడంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాకర్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో గణిత ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ అదనంగా గణిత ఉపాధ్యాయుడిని పంపించినట్లు తెలుస్తోంది. యూపీఎస్ కొమ్ముగూడెంలో 14 మంది విద్యార్థులకు హిందీ పోస్టు మాజూరు లేనప్పటికీ 330 మంది విద్యార్థులు ఉన్న జెడ్పీహెచ్‌ఎస్ నుంచి ఉపాధ్యాయురాలిని సర్దుబాటు చేయడంతో ఆమె డీఈఓను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.