
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
దుమ్ముగూడెం: మండలంలో ఇసుక లారీలు వందల సంఖ్యలో రావడంతో తూరుబాక నుంచి పెద్దనల్లబల్లి వరకు కొన్ని కిలో మీటర్ల మేర ఇసుక లారీలు నిలిచిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఏపీలోని సీతపేటం వద్ద భద్రాచలం – చర్ల ప్రధాన రహదారిపై రెండు ఇసుక లారీలు దిగబడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వందల సంఖ్యలో లారీలు ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో సామాన్య ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఇసుక లారీలను ములకపాడు వయా మారాయిగూడెం నుంచి డైవర్షన్ చేసి పంపినప్పటికీ అటువైపు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ట్రాఫిక్ జామ్ కొనసాగింది.
రహదార్లపైనే నిలుపుతున్న ఇసుక లారీలు
చర్ల: మండలంలో కొనసాగుతున్న ఇసుక క్వారీల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణా కోసం వచ్చే లారీలకు ఇసుక రీచ్‌ల నిర్వాహకులు యార్డులను ఏర్పాటు చేయకపోవడంతో లారీ డ్రైవర్లు ఎక్కడబడితే అక్కడ లారీలను నిలుపుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల కొద్ది వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా తిరుగుతున్న ఓవర్ లోడ్ ఇసుక లారీలు వల్ల రోడ్లు ఎక్కడికక్కడే కృంగిపోయి పెద్ద ఎత్తున లారీలు దిగబడుతున్నాయి. ఇసుక రీచ్‌ల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఎందుకు లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.