
సుదీర్ఘ పోరాటాల నేల తెలంగాణ
ఖమ్మంసహకారనగర్: సుదీర్ఘ పోరాటాల నేల తెలంగాణ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం తన అస్తిత్వం, గుర్తింపు కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిందని, ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, దశాబ్దాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత బతుకమ్మ, బోనాలు, సంస్కృతి, కళలు, సంప్రదాయాలకు మంచి గుర్తింపు, ప్రాముఖ్యత లభించిందన్నారు. అభివృద్ధి ప్రమాణాలలో దేశంలోని అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, ప్రజల జీవన ప్రమాణాలు క్రమంగా మెరుగు పడ్డాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎ.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
●జిల్లా పరిషత్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెడ్పీ సీఈఓ దీక్షారైనా జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
●తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో సంఘం జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు శేషుప్రసాద్, విజయ్‌కుమార్, హరీశ్, రాంబాబు, మాధవరావు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరణలో
అదనపు కలెక్టర్ శ్రీజ