వేతనాల కోసం కుక్‌లు, కామాటిలు, వాచ్‌మెన్ల విధులు బహిష్కరణ
కొన్నిచోట్ల అల్పాహారం,
భోజనం అందక విద్యార్థుల ఇక్కట్లు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం..
కార్మిక సంఘాల మద్దతు
కార్మికుల సమ్మె
ఖమ్మంమయూరిసెంటర్: గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డెయిలీ వేజ్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. కొద్దినెలలుగా కుక్, కామాటి, వాచ్‌మన్లకు వేతనాలు రాకపోవడంతో శుక్రవారం విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. జిల్లాలో డెయిలీ వేజ్ వర్కర్లు 77 మంది, ఔట్‌సోర్సింగ్ వర్కర్లు 45 మంది ఉండగా.. వీరు విధులు బహిష్కరించడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం వండి వడ్డించే వారు లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు వార్డెన్లకు సూచించారు. కానీ వార్డెన్లు పట్టనట్లు వ్యవహరించడంతో విద్యార్థులకు టిఫిన్ అందలేదు. రెగ్యులర్ వర్కర్లు ఉన్నచోట్ల నుంచి అవసరమైన వసతిగృహాలకు కొందరిని పంపించారు. ఇంకొన్ని వసతిగృహాల్లో విద్యార్థులతోనే వంట చేయించినట్లు తెలిసింది.
వేతనాలు అందలేదని వర్కర్లు విధులు బహిష్కరించారు. ఈ ప్రభావంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వార్డెన్లకు సూచించాం. రెగ్యులర్ వర్కర్లు ఉన్న చోటనుంచి అవసరమైన వసతిగృహాలకు పంపించాం. ఎక్కడ కూడా విద్యార్థులు ఇబ్బండి పడకుండా చూస్తున్నాం.
– విజయలక్ష్మి, డీడీ, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ
వసతిగృహాల్లోని ఔట్‌సోర్సింగ్, డెయిలీ వేజ్ వర్కర్ల సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతు తెలి పాయి. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్‌లోని బాలికల కళాశాల వసతిగృహం ఎదుట వర్కర్లతోపాటు కార్మిక సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ కొద్దినెలలుగా వర్కర్లకు వేతనాలు ఇవ్వకపోడమే కాక పనిభారం మోపారని తెలిపారు.
ఇకనైనా పెండింగ్ వేతనాలు చెల్లించి, శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, డీవైఎఫ్‌ఐ నాయకులు సింగు నరసింహారావు, సుబాన్, చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.