
హైవేపై సర్వీస్ రోడ్డు కోసం రైతుల ధర్నా
పెనుబల్లి: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భాగంగా మండలంలోని కొత్తరాయిగూడెం, పాతకారాయిగూడెం వద్ద ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించాలని పెనుబల్లి మండల రైతులు శుక్రవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ హైవేపై చిన్న బ్రిడ్జిల నిర్మాణంతో పొలాలకు యంత్రాలు, వాహనాలను తీసుకెళ్లడం కష్టమవుతుందని వాపోయారు. కాగా, రైతులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ హైవే అధికారి అమరేందర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. అలాగే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని దయానంద్ తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి
తిరుమలాయపాలెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి సూచించారు. తిరుమలాయపాలెం సీహెచ్‌సీ నుంచి విడదీసి పాతర్లపాడులో ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె అదనపు జిల్లా వైద్యాధికారి అరుణతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ,ఐపీ రికార్డులు పరిశీలించడంతో మందుల లభ్యత, చికిత్స వివరాలు ఆరాతీసి ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం హెపటైటిస్ బీ వ్యాక్సినేషన్ డే సందర్బంగా తిరుమలాయపాలెం ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌గౌడ్ వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కృపాఉషశ్రీ, అమర్‌సింగ్, బొల్లికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

హైవేపై సర్వీస్ రోడ్డు కోసం రైతుల ధర్నా