
చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం
● ముగిసిన టెండర్ల దాఖలు గడువు
ఖమ్మంవ్యవసాయం: ఎట్టకేలకు చేపపిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. జిల్లాలో నిర్దేశించిన జలాశయాలకు చేపపిల్లలు సరఫరా చేసేందుకు టెండర్ల దాఖలు గడువు మూడు సార్లు పొడిగించిన అనంతరం ముగిసింది. ఈమేరకు ఏడుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా, వీరి ఫామ్స్‌ను పరిశీలించి ఖరారు చేశాక చేపపిల్లల పంపిణీ మొదలుకా నుంది. ఇప్పటికే అదును దాటుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతుండగా ఎట్టకేలకు ప్రక్రియలో వేగం పెరగడంతో ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాకు 3.49కోట్ల పిల్లలు
జిల్లాలోని 882 రిజర్వాయర్లు, పెద్ద చెరువులు, చిన్న చెరువుల్లో నీటి సామర్ద్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద చేప పిల్లలు పంపిణీ చేస్తారు. 80–100 మి.మీ.ల సైజు పెద్ద చేపపిల్లలు 2.11 కోట్ల వరకు, 35–40 మి.మీ. ఉండే చిన్నపిల్లలు 1.38 కోట్లు కలిపి 3.49 కోట్ల చేపపిల్లలకు జలాశయాల్లో విడదల చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4 కోట్లు వెచ్చించనుంది. కాగా, టెండర్లు దాఖలు చేసిన వారి సీడ్ ఫామ్స్‌ను జిల్లా మత్స్యశాఖ అధికారి నేతృత్వాన బృందం పరిశీలిస్తుంది. ఆతర్వాత అదనపు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీ టెండర్లను పరిశీలించి తక్కువ బిడ్ దాఖలు చేసిన వారిని ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి జలాశయాల్లో చేపపిల్లలను వదలాలని మత్స్యశాఖ కసరత్తు చేస్తోంది.
రైతువేదికలో జరిగిన ఘటనపై కలెక్టర్ ఆరా
కామేపల్లి: కామేపల్లి రైతు వేదికలో గురువారం యూరియా కూపన్ల పంపిణీ సందర్భంగా జరిగి న ఘటనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆరా తీశా రు. రైతులతో ఏఈఓలు దురుసుగా ప్రవర్తించినట్లు కథనాలు రావడంతో నివేదిక ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారిని ఆదేశించినట్లు తెలిసింది. కాగా, కూపన్లు పంపిణీ చేస్తుండగా జాస్తిపల్లికి చెందిన రైతు రాయల కృష్ణ తనతో పాటు కామేపల్లి ఏఈఓ శ్రీకన్యను దూషించాడంటూ మద్దులపల్లి ఏఈఓ రవికుమార్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
వివాదాస్పద భూములకు ఫెన్సింగ్
ఖమ్మం అర్బన్: రఘునాథపాలెం సమీపాన ఖమ్మం అర్బన్ మండల పరిధి మల్లెమడుగు లో వివాదాస్పద భూములకు పోలీసుల పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఫెన్సింగ్ వేశారు. ఆర్‌డీఓ నరసింహారావు, తహసీల్దార్ సైదులు, ఉద్యోగులు భూములకు ఫెన్సింగ్ వేయించి ఎవరూ ప్రవేశించవద్దని సూచిస్తూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సుమారు 29ఎకరాల భూమికి సంబంధించి కొన్నేళ్లుగా మల్లెమడుగు రైతులు, భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. భూముల్లోకి ఎవరూ వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా కొందరు సాగు చేయడంతో ఫెన్సింగ్ వేయించామని ఆర్‌డీఓ, తహసీల్దార్ తెలిపారు. కాగా, భూమి కొనుగోలు చేసినట్లు చెబుతున్న టి.శ్రీనివాసరావు మాట్లాడారు. అధికారులు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫెన్సింగ్ వేయడం సరికాదని, ఈ అంశంపై చట్టపరంగా పోరాడుతామని తెలిపారు.