
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
మధిర: మధిరలో మృత్యుంజయ స్వామి ఆలయ సమీ పాన వైరా నదిలో ఈతకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెంకు చెందిన తొర్లికొండ కృష్ణ(45) మధిరలో సెంట్రింగ్ వర్క్ చేస్తాడు. కొద్దిరోజులుగా మధిరచెరువులో ఈత నేర్చుకుంటున్న ఆయన పలువురితో కలిసి వైరా నదికి వెళ్లాడు. అయితే, చెక్‌డ్యామ్ వద్ద ప్రవాహంలో కృష్ణతో పాటు రామ్ కొట్టుకుపోయారు. ఈక్రమాన కృష్ణను రామ్ బయటకు లాగి వెళ్తుండగా ఒడ్డుకు వచ్చేసరికి కృష్ణ నీటిపై తేలియాడుతూ కనిపించాడు. కాగా, వరద భయంతో గుండె ఆగి మృతి చెందాడని భావిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. మధిర టౌన్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైతులను రెచ్చగొట్టారంటూ జర్నలిస్టుపై కేసు
కొణిజర్ల: ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలని రైతులను ప్రేరేపించారంటూ ఓ టీవీ చానల్ (సాక్షి కాదు) రిపోర్టర్‌పై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 11న కొణిజర్ల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు దీరారు. అక్కడకు వచ్చిన రిపోర్టర్ సాంబశివరావు, తదితరులు యూరియా సరిపోవడం లేదని చెప్పాలంటూ రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని ఎస్సై సూరజ్ తెలిపారు. కొణిజర్లకు చెందిన గంధం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని వెల్లడించారు. కాగా, జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసు ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి ఆధ్వర్యాన జర్నలిస్టులు అడిషనల్ డీసీపీని ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు.