
తీరని యూరియా వెతలు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం సొసైటీ కార్యాలయం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు సీపీఎం ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని, రాష్ట్రప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని ఆరోపించారు. నాయకులు గొల్లపూడి పెద్ద కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, దివ్వెల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
●తల్లాడ: తల్లాడ సొసైటీ పరిధి రైతువేదికల్లో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. అన్నారుగూడెం, బిల్లుపాడుల్లో కూపన్ల ఆధారంగా బందోబస్తు నడుమ పంపిణీ చేపట్టారు.
●నేలకొండపల్లి: నేలకొండపల్లి పీఏసీఎస్‌లో యూరియా పంపిణీకి మూడు రోజుల క్రితం కూపన్లు జారీ చేశారు. వీటి ఆధారంగా ఒక్కో రైతుకు బస్తా చొప్పున యూరియా ఇస్తుండగా కొన్ని కూపన్లపై నంబర్లు డబుల్ రావడంతో వివాదం నెలకొంది. దీనిపై ఓ రైతు నేలపై పడుకుని నిరసన తెలిపారు. అక్కడకు వచ్చిన ఏఓను నిలదీయగా కూపన్లు ఉన్న అందరికీ యూరియా పంపిణీ చేశారు.
●వైరా: గత నెలలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చినా ఇప్పటికీ యూరియా పంపిణీ చేయలేదని పలువురు రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం వైరా తహసీల్దార్, ఏఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. వైరా రిజర్వాయర్ కింద సాగు చేసిన వరి పంటకు యూరియా లేక ఎదుగుదల లోపిస్తోందని తెలి పారు. అయితే, రెండు రోజుల్లో యూరియా అందించే ఏర్పాట్లు చేస్తామని వైరా ఎస్‌ఐ పి.రామారావు, ఏఓ మంజుఖాన్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

తీరని యూరియా వెతలు