
ప్రతీ ఒక్కరికి ఆర్థిక భద్రత అవసరం
కూసుమంచి: ప్రస్తుత తరుణాన అందరికీ ఆర్థిక భద్రత అవసరమని, ఇందుకోసం పొదుపు మార్గాన్ని ఎంచుకోవాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ చిన్మయ్‌కుమార్ సూచించారు. కూసుమంచి మండలం నేలపట్లలో ఎస్‌బీఐ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన జన సురక్ష ప్రచార శిబిరం, ఆర్థిక అక్ష్యరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి, డబ్బు పొదుపు చేస్తూ ఆర్థికంగా బలపడాలన్నారు. ఈవిషయంలో అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదేసమయాన సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు వివరిస్తున్నామని చెప్పారు. ఎస్‌బీఐ డీజీఎం కస్తూరి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా ఆర్థిక సేవలే కాకుండా ప్రజలను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దడం, పేద పిల్లల చదువుకు తోడ్పాటు కోసం స్కాలర్‌షిప్ ఇస్తున్నామని తెలిపారు. డీఆర్డీఓ ఏపీడీ జయశ్రీ, ఆర్‌బీఐ ఎల్‌డీఓ చేతన్ గోనేకర్, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రాజశేఖర్, కూసుమంచి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌బీఐ ప్రాంతీయ డైరక్టర్ చిన్మయ్‌కుమార్