
సాదాబైనామాకు సై..
2020 ఏడాదిలో 1,11,443 దరఖాస్తులు
నాటి తేదీ కటాఫ్‌గానే
దరఖాస్తుల పరిశీలన
ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తుదారుల
ఐదేళ్ల నిరీక్షణకు తెర
నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ ..
తెల్ల కాగితాలపై నమోదైన భూకొనుగోళ్ల ఒప్పందాలు ఇకపై అధికారికం కానున్నాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 106జీఓతో దరఖాస్తుదారుల ఐదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. జిల్లాలో 2020లో 1,11,443 దరఖాస్తులు అందాయి. నాటి దరఖాస్తుల కటాఫ్ తేదీ ఆధారంగానే పరిశీలించి అధికారికంగా హక్కు కల్పించనున్నారు. భూముల క్రమబద్ధీకరణపై కోర్టు స్టే తొలగిపోవడం, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో దరఖాస్తుదారులకు ఊరట కలిగించినట్లయింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఐదేళ్లు నిలిచిపోవడంతో..
భూములను రెగ్యులరైజ్ చేయడానికి గత ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో జీఓ 121 జారీ చేయగా రెవెన్యూ యంత్రాంగానికి సాదాబైనామా దరఖాస్తులు వెల్లువలా అందాయి. అయితే, 2020 ఆర్వోఆర్ చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు లేనందున కోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి వేలాదిమంది నిరీక్షిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టంలో కూడా అధికంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణకే దరఖాస్తులు అందాయి. ఇటీవల స్టే తొలగించడంతోపాటు ప్రభుత్వం 106 జీఓను విడుదల చేయగా దరఖాస్తులకు మోక్షం లభించనుంది.
హక్కులు లేక అవస్థ
పట్టేదారు పాస్ పుస్తకం ఉన్న భూములకు రుణాలు అందడమే కాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అలాగే పంటల అమ్మకం, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలోనూ ఒక్కోసారి పట్టాదారు పాస్ పుస్తకాలు కీలకంగా మారుతున్నాయి. కానీ వేలాది మంది రైతులు భూముల క్రయవిక్రయాలను తెల్లకాగితాలపై చేసుకోవడంతో పాస్ పుస్తకాలు లేక, అధికారిక భూహక్కులు దక్కక ప్రభుత్వపరంగా పథకాలకు దూరమవుతున్నారు.
ఆ కటాఫే ప్రామాణికం
స్టే తొలగించినా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేక సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఏ ప్రాతిపదికత తీసుకుంటారో స్పష్టత రాలేదు. కానీ బుధవారం జీఓ 106 విడుదల చేసింది. దీని ప్రకారం 2014కు పూర్వం సాదాబైనామాల ద్వారా క్రయవిక్రయాలు చేయడంతోపాటు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను పరిష్కరించనున్నారు. అయితే, గత 12ఏళ్లు భూమి తమ స్వాధీనంలోనే ఉన్నట్లు దరఖాస్తులు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
రెవెన్యూ సదస్సుల్లోనూ..
ధరణి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురాగా భూసమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో మొత్తం 75,004 దరఖాస్తులు అందగా, వీటిలో సాదాబైనామాపైనే 45,254 ఉన్నాయి. వీటిలో 2020లో చేసుకున్న వారిని గుర్తించేలా వడబోయనున్నారు. ప్రభుత్వ జీఓలో 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు చేసుకున్న దరఖాస్తులనే పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 6ను అనుసరించి ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలులేదు. అయితే, కటాఫ్ తేదీ తర్వాత సాదాబైనామాపై అందిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.
స్టే తొలగింపు, జీఓ జారీతో తప్పిన చిక్కులు
సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 2014కి ముందు తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన ఐదెకరాల లోపు కుష్కీ, రెండున్నర ఎకరాల తరి ఉన్న చిన్న, సన్నకారు రైతుల భూములు క్రమబద్ధీకరిస్తాం. మున్సిపల్ ప్రాంతాలు తప్ప మిగతా చోట్ల ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2020లో దరఖాస్తులు ఇచ్చి.. మరోసారి రెవెన్యూ సదస్సుల్లోనూ ఇచ్చిన వారికి గతంలోనే నోటీసులు ఇచ్చాం. 2020 కటాఫ్ తేదీ ప్రకారమే దరఖాస్తుల పరిశీలన ఉంటుంది.
– పి.శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)

సాదాబైనామాకు సై..

సాదాబైనామాకు సై..