
ఆర్టీసీ ఆధ్వర్యాన ‘యాత్రాదానం’
సత్తుపల్లిటౌన్: టీజీ ఆర్టీసీ ఆధ్వర్యాన ‘యాత్రాదానం’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి తెలిపారు. సత్తుపల్లిలో గురువా రం ఆమె మాట్లాడుతూ సాంస్కృతిక విలువల పరిరక్షణ, సమాజానికి ఇచ్చే మానవత్వపు బహుమతిలో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ఉన్నా స్థోమత లేని అనా థలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పంపించేలా ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపారు. విరాళాల ఆధారంగా బస్సులు సమకూరుస్తామని వెల్లడించా రు. సత్తుపల్లి డిపో పరిధిలో బుకింక్ కోసం డిపోలో లేదా 99592 25962, 98666 19189 నంబర్లలోసంప్రదించాలని డీఎం సూచించారు.
ట్రాఫిక్ నిర్వహణపై
ప్రత్యేక దృష్టి
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలోని రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. రద్దీ ప్రాంతాలలో అదనంగా సిబ్బందిని నియమించి, వాహనదారులతో అనవసర వివాదాలకు పోకుండా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని తెలిపారు. అలాగే, బాడీవార్మ్ కెమెరాల ఉపయోగం, సీసీ కెమెరాల ఏర్పాటు, జరిమానా వసూళ్లపై సమీక్షించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను గుర్తించాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐ సత్యనారయణ పాల్గొన్నారు.
ఉపాధ్యాయురాలు
సునందకు కీర్తి పురస్కారం
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం మామిళ్లగూడెం: ప్రముఖ రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉరిమళ్ల సునందకు 2024 సంవత్సరానికి గాను తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది. ఆమె ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్విస్తూనే సాహిత్యంలో రాణిస్తున్నారు. ఎక్కడ పనిచేసాన విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ సాహిత్యంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే, ఏటా తన సోదరి వురిమళ్ల పద్మజ పేరుతో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందచేస్తున్నారు. కాగా, తెలుగు యూనివర్సిటీ ప్రకటించిన పురస్కారాన్ని త్వరలో సునంద అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయులు, కవులు, రచయితలు అభినందించారు.
జిల్లాలో పలుచోట్ల వర్షం
ఖమ్మంవ్యవసాయం: ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు రోజులుగా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నా యి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కూడా జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. బుధవారం ఉదయం 8–30నుంచి గురువారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లాలో సగటున 22.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 68.8 మి.మీ.వర్షపాతం నమోదు కాగా, వేంసూరు మండలంలో 57.2, పెనుబల్లిలో 56.2, కారేపల్లిలో 41.8, తల్లాడలో 40.2, చింతకానిలో 22.4, ముదిగొండలో 21.6, కామేపల్లి, రఘునాథపాలెంలో 20.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు 32 నుంచి 38 డిగ్రీల వరకు నమోదు కాగా గురువారం 28 డిగ్రీలకు పడిపోయింది. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ఆర్టీసీ ఆధ్వర్యాన ‘యాత్రాదానం’