
అటవీ సంపద రక్షణ అందరి బాధ్యత
ఖమ్మంవ్యవసాయం: అటవీ సంపద, అడవుల సంరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరిస్తే అటవీ అమరవీరులకు నివాళులర్పించినట్లవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలోని అటవీ శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులుఅర్పించాక కలెక్టర్ మాట్లాడుతూ తాను భద్రాద్రి కలెక్టర్‌గా ఉన్న సమయాన అటవీ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడం కలచివేసిందని తెలిపారు. అటవీ ఉద్యోగులు అడవుల పరిరక్షణకు రాత్రీపగలు పనిచేస్తున్నారని అభినందించారు. అడవుల నరికివేతతో మానవ మనుగడ కష్టమవుతుందనే విషయాన్ని అందరూ గుర్తించి ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణను బాధ్యతగా కాక ప్రజలు కర్తవ్యంలా భావించాలని తెలిపారు. అనంతరం ఉద్యోగులకు రెయిన్ కోట్లు, స్టిక్ గార్డ్‌లు పంపిణీ చేయగా కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరా పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన వివిధ శాఖల ఆధ్వర్యాన జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం పెరుగుతుందనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. జిల్లాకు మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణాలపై సూచనలు చేసిన కలెక్టర్.. కొన్ని పనులు ప్రారంభం కాకపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్, రఘునాథపాలెం మండలంలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్, సత్తుపల్లి, మధిర, పాలేరులో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో పనులు మొదలుకాకపోతే వాటిని రద్దు చేయాలని తెలిపారు. అలాగే, చెక్‌డ్యాంలు, సీతారామ ఎత్తిపోతల పథకం పనులపై కలెక్టర్ సమీక్షించారు. సీపీఓ ఏ.శ్రీనివాస్, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ రాంగోపాల్‌రెడ్డి, ఎస్‌ఈలు యాకోబు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో
కలెక్టర్ అనుదీప్