
సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ
● 80 – 100 శాతం రాయితీపై పరికరాలు ● జిల్లాలో 24 వేల ఎకరాలకు సమకూర్చేలా ప్రణాళిక ● ఒక్కో రైతుకు 12.20ఎకరాల వరకు అవకాశం
ఖమ్మంవ్యవసాయం: పంటల సాగులో నీరు పొదుపు చేసేలా వినియోగించే సూక్ష్మ సేద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ విధానంలో నీటిని నేరుగా మొక్కల వేర్ల దగ్గర చుక్కలుచుక్కలుగా విడుదల చేయనుండడంతో ఎక్కడా వృథా అయ్యే అవకాశముండదు. అంతేగాక ఎరువులను కూడా నీటిలో కలిపి సరఫరా చేసే అవకాశముండడంతో కలుపు, మట్టి కోత సమస్యలు తగ్గిపోతాయి. ఈమేరకు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం(ఆర్‌కేవీవై) కింద సూక్ష్మ సేద్య పరికరాల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60–40 నిష్పత్తిలో రైతులకు నిధులు మంజూరు చేస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ
నీటి పొదుపును ప్రోత్సహించడం, డ్రిప్ పరికరా లను వివిధ వర్గాల రైతులకు చేరువ చేసేలా ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ఈమేరకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతంపై, బీసీ రైతులకు 90 శాతంపై, జనరల్(ఓసీ) రైతులైతే 80 శాతంపై సూక్ష్మ సేద్య పరికరాలను ఉద్యాన శాఖ ద్వారా అందించనున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసే రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుంది.
ఆయిల్‌పామ్‌కు ప్రాధాన్యత
సూక్ష్మసేద్యం విధానాన్ని ఆయిల్ పామ్ తోటల్లో అమలుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 21,275 ఎకరాల ఆయిల్ పామ్ తోటలకు సూక్ష్మ సేద్య పరికరాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీంతో పాటు మిర్చి, పత్తి, మొక్కజొన్న, పండ్ల తోటలు, కూరగాయలు తది తర పంటలు మరో 3వేల ఎకరాలకు సైతం అందించాలని ఉద్యాన శాఖకు ఆదేశాలు అందాయి.
రూ.93.82 కోట్లు మంజూరు
జిల్లాలో ఈ ఏడాది సూక్ష్మ సేద్య పథకానికి ప్రభుత్వం రూ.93.82 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఆయిల్‌పామ్ తోటలకు రూ. 63.82 కోట్లు, మిగతా పంటలకు రూ.30 కోట్లు కేటాయించారు. ఆయిల్ పామ్ ఎకరాకు రూ.30వేల చొప్పున, మిర్చి, పత్తి, మొక్కజొన్న, పండ్లు, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.లక్ష విలువైన సూక్ష్మ సేద్య పరికరాలను అందిస్తారు. పరికరాల సరఫరా కోసం పది కంపెనీలు అందుబాటలో ఉండగా, అర్హులైన రైతులు కంపెనీని ఎంచుకుని, ధ్రువపత్రాలతో మీ సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసువావాల్సి ఉంటుంది. ప్రభుత్వ రాయితీతో సూక్ష్మ సేద్య పరికరాలను వినియోగించుకుంటూ ఏడేళ్లు గడిచిన రైతులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 12.20 ఎకరాల వరకు సబ్సిడీ పరికరాలు అందిస్తారు.
రైతులు వినియోగించుకోవాలి
పంటల సాగుకు ప్రయోజనకరమైన సూక్ష్మ సేద్య పరికరా లను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయనుంది. 80నుంచి 100 శాతం వరకు రాయితీ అందనుంది. ఆయిల్ పామ్ రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నందున ఆసక్తి ఉన్న వారు మీ సేవ కేంద్రాల దరఖాస్తు చేసుకోవాలి. – ఎం.వీ.మధుసూదన్,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి

సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ