
యువకుడి మృతదేహం లభ్యం
వేంసూరు: ఏపీలోని వాడపల్లిలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. వేంసూరు మండలం లచ్చన్నగూడెంకు చెందిన పామర్తి సాయిదినేష్ ఈనెల 19న స్నేహితులతో కలిసి వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లగా అక్కడ గోదావరిలో గల్లంతయ్యాడు. అప్పటి నుంచి రెస్క్యూ బృందాలు గాలిస్తుండడంగా సోమవారం మృతదేహం లభించడంతో కుటుంబీకులకు అప్పగించారు.
గుట్టపై మహిళ అస్తిపంజరం..
పెనుబల్లి: మండలంలోని కొత్తలంకపల్లి శివారు కుక్కలగట్టుపై ఓ మహిళ అస్తిపంజరాన్ని గుర్తించారు. పశువులు మేపేందుకు వెళ్లిన కాపరులు సోమవారం అస్తిపంజరాన్ని గుర్తించి వీఎం.బంజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ పరిశీలించగా 20 – 30 ఏళ్ల వయస్సు మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సుమారు ఆరు నెలల క్రితం మృతి చెంది ఉండొచ్చనే భావనకు వచ్చారు. గ్రామపంచాయతీ కార్యదర్శి యలమద్ది మల్లికార్జున్‌రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
పెనుబల్లి: మండలంలోని కొత్తకుప్పెనకుంట్లకు చెందిన గొల్లమందల జయమణి వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులైన వంశీ – జయమణి మధ్య ఘర్షణ జరుగుతుండగా మనస్తాపానికి గురైన ఆమె ఇంటి వెనకాల వ్యవసాయ బావిలో దూకింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీఎం బంజర్ పోలీసులు మృతదేహాన్ని తీయించి విచారణ చేపడుతున్నామని ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. కాగా, జయమణికి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గేదె పంచాయితీలో దంపతులపై దాడి
నేలకొండపల్లి: గేదె విషయమై జరిగిన పంచాయితీ దంపతులపై దాడికి దారి తీసింది. మండలంలోని శంకరగిరితండాకు చెందిన బానోత్ నాగేశ్వరరావు ఇంట్లోకి మరొకరి గేదె వస్తుండగా అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారికి సోమవారం పంచాయితీ జరిగింది. ఈ క్రమాన మాటామాట పెరగగా నాగేశ్వరరావు, ఆయన భార్యపై ఎదుటి వర్గం వారు దాడి చేశారు. దీంతో గాయపడిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువకుడి మృతదేహం లభ్యం