
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళ, బుధవారాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలోని విజయ డెయిరీ యూనిట్‌ను మంగళవా రం ఉదయం పరిశీలించనున్న మంత్రి నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తారు. ఆతర్వాత ఖమ్మం 15వ డివిజన్‌లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక బుధవా రం కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించి ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఆపై సాయంత్రం 3 గంటలకు రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాలో రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
గూడ్స్ రైలు నుంచి
విడిపోయిన బోగీలు
కారేపల్లి: లింక్ ఊడిపోవడంతో గూడ్స్ రైలు నుంచి కొన్ని బోగీలు విడిపోయిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి స్టేషన్ సమీపాన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. డోర్నకల్ జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా ఖాళీ బోగీలతో గూడ్స్ రైలు కొత్తగూడెం వైపు వెళ్తోంది. గేటుకారేపల్లి స్టేషన్ సమీపానికి వచ్చేసరికి కొన్ని బోగీలకు లింగ్ ఊడిపోయింది. దీంతో కొన్ని బోగీలను వదిలేసి ఇంజిన్ ఇంకొన్ని బోగీలతో వెళ్తుండడాన్ని గేటుకారేపల్లి, అనంతారం గేట్‌మెన్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రైవర్‌ను అప్రమత్తం చేసి గూడ్స్ రైలును నిలిపివేయగా, ఆతర్వాత సిబ్బంది చేరుకుని ఊడిపోయిన బోగీలను మరో ఇంజన్ సాయంతో తీసుకొచ్చి జత చేశారు. దీంతో అరగంట తర్వాత గూడ్స్ రైలు ముందుకు కదిలింది. ఇదే సమయాన గేటుకారేపల్లి, అనంతారం గేట్లను మూసివేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పాత భవనాలతో
భయం.. భయం
కూసుమంచి: కూసుమంచిలోని పాత మసీదు సెంటర్‌లో శిథిలావస్థకు చేరిన భవనాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇళ్ల గోడలు కొద్దికొద్దిగా కూలిపోతున్నాయి. ఈక్రమాన పూర్తిస్థాయిలో కూలితే ఆ సమయాన ఎవరైనా అటుగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి శిథిల గృహాలను కూల్చివేయించాలని స్థానికులు కోరుచుకున్నారు.
కోల్ మూమెంట్ ఈడీగా వెంకన్న
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బి.వెంకన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2010 ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్(ఐఆర్‌టీఎస్) బ్యాచ్‌కు చెందిన వెంకన్న మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించాక సీఎండీ ఎన్.బలరామ్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఏటా సుమారు 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా అవుతుందని, ఇందులో అధిక భాగం రైల్వే ద్వారానే సరఫరా చేస్తామని తెలిపారు. వార్షిక లక్ష్యాల సాధనలో కోల్ మూమెంట్ విభాగం కీలకంగా నిలుస్తున్నందున ఈడీ పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం ఈడీ మాట్లాడుతూ సంస్థ లక్ష్యాల సాధనకు అందరి సహకారంతో కృషి చేస్తానని వెల్లడించారు.

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన