
సాగర్ ఆయకట్టుకు జలకళ
సాఫీగా నీటి ప్రవాహం
కూసుమంచి: సాగర్ ఎడమ కాల్వపై మత్స్య పరిశోధన కేంద్రం వద్ద ఉన్న యూటీ గత ఏడాది వరదలతో కొట్టుకుపోగా పునర్నిర్మించారు. ఈ పనులు చివరి దశకు చేరగా నిర్మాణ ప్రాంతం వద్ద కాల్వలో నీరు సాఫీగా సాగేలా అధికారులు ఇరువైపులా మట్టి కట్టలు వేయించారు. కాల్వకు డిప్యూటీ సీఎం, మంత్రి నీరు విడుదల చేశాక యూటీ వద్ద సాఫీగా ప్రవహించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కృష్ణా జలాలు సాగర్ కాల్వల్లో బిరబిరా పరుగులెడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగుపై సందిగ్ధత నెలకొన్న వేళ సాగర్ జలాలు రావడంతో సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌లోకి నీరు చేరడంతో సాగు అవసరాలకు పాలేరు రిజర్వాయర్ నుంచి సోమవారం వెయ్యి క్యూసెక్కుల నీరు వదిలారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో నీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. ఏటా జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే సాగర్ జలాలను ఈసారి ఇక్కడ వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ముందస్తుగానే వదలడంతో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగుకు కష్టాలు తీరనున్నాయి.
నిన్నటి వరకు వెలవెల
జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిలుస్తుండగా, పాలేరు రిజర్వాయర్ నీరు లేక వెలవెలబోయింది. రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా.. ఈనెల మొదట్లో 12.45 అడుగులకు పడిపోయింది. దీంతో అటు సాగు, ఇటు తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలోని 2.54 లక్షల ఎకరాల సాగుపై సందిగ్ధత నెలకొంది.
తాగునీటి అవసరాలకు..
పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీటికి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తుండగానే కృష్ణా పరీవాహకంలో భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు చేరింది. ఈక్రమాన సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌లోకి నీరు విడుదల చేయడంతో రిజర్వాయర్ 20 అడుగులకు చేరింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని భావించినా, రైతుల అవస్థల దృష్ట్యా సాగు కోసం కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఏటా మాదిరిగా సాగు అవసరాలకు ఈనెల 20నుంచి సాగర్ జలాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో పాలేరు రిజర్వాయర్‌లో 20 అడుగులుగా ఉన్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నా.. మరోమారు సాగర్ నుంచి వచ్చే నీటితో రిజర్వాయర్ నిండుతుందని భావిస్తున్నారు.
పంటల సాగుకు సిద్ధం..
సాగుపై సందిగ్ధంగా ఉన్న సమయాన సాగర్ జలాలు విడుదల కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు దుక్కులు దున్ని, వరి నారు సిద్ధం చేసుకున్న రైతులు ఇప్పుడు ధైర్యంగా నాట్లు వేయనున్నారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 2,54,270 ఎకరాల భూమి ఉండగా, ఈ నీటితోనే పాలేరు, వైరా రిజర్వాయర్లు, పలు చెరువులు నింపాల్సి ఉంటుంది.
స్విచాన్ చేసి రెండో జోన్‌కు..
పాలేరు రిజర్వాయర్ వద్ద రెండో జోన్‌కు సాగునీటిని సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. తొలుత వెయ్యి క్యూసెక్కుల నీరు దిగువకు వదలగా.. డిప్యూటీ సీఎం, మంత్రి పూజలు చేసి కృష్ణా జలాలకు చీర, సారె సమర్పించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్, ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మార్క్‌ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వరినాట్లు వేసుకుంటాం..
మాకు పెద్ద కాల్వ కింద మూడెకరాల భూమి ఉంది. ఇన్నాళ్లు నీళ్ల పరిస్థితి తెలియక నాట్లు వేయడానికి ఆలోచించా. కానీ ముందుగానే సాగర్ నీళ్లు వదలడంతో వరి నాట్లు వేస్తాం. ముందుగా నీళ్లు వదలడం రైతులకు ఎంతో మంచిది.
– జవ్వాజి పవన్‌కుమార్, మల్లాయిగూడెం
పాలేరు రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల
దశల వారీగా పూర్తిస్థాయిలో విడుదలకు ప్రణాళిక
ఆయకట్టు పరిధిలో 2.54 లక్షల ఎకరాల సాగుకు భరోసా
ఎడమకాల్వ వద్ద స్విచాన్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి

సాగర్ ఆయకట్టుకు జలకళ

సాగర్ ఆయకట్టుకు జలకళ