
●బోడకాకర.. కాస్ట్‌లీ గురూ!
ఖమ్మంవ్యవసాయం/మధిర: కాకరలో ఓ రకం బోడ కాకర. ఏటా ఈ సీజన్‌లో, అదీ తక్కువగా లభించే ఈ కాకరకు డిమాండ్ ఉంటుంది. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే బోడకాకర కాయలు విక్రయిస్తుండగా ప్రాంతాల వారీగా కిలో ధర రూ.320 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. ఖమ్మంలోని రైతుబజార్ల బోర్డులపై రూ.280గా రాస్తున్నా ఆ ధరకు విక్రయించడం లేదు. ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాల నుంచి బోడ కాకర ఖమ్మం మార్కెట్‌కు వస్తోందని చెబుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో రిటైల్ వ్యాపారులు రూ.200 చొప్పున కొనుగోలు చేసి రూ.320, అంత కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
చికెన్ ధర కన్నా అధికం
సాధారణంగా బోడకాకర ధర కిలో రూ.180నుంచి రూ.200 వరకు పలుకుతుంది. కానీ ఈసారి ధర పెరగడం గమనార్హం. ప్రస్తుతం చికెన్ కిలో ధర రూ.200 ఉండగా.. అంతకు మించి బోడ కాకర ధర ఉండడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం ఈ సీజన్‌లో లభించేది కావడంతో భారమైనా కొనుగోలు చేస్తున్నారు. గుట్టలు, కొండలు, అడవుల్లో లభించే ఈ కాకరను ప్రస్తుతం కొందరు రైతులు సాగు చేస్తున్నారు.
కిలోకు రూ.320కి పైగానే ధర