
ఎరువు.. కృత్రిమ కరువు
● జిల్లా అంతటా యూరియాకు కటకట ● స్టాక్ ఉన్నా పక్కదారి పట్టిస్తున్న కొందరు డీలర్లు ● అమ్మకానికి ఇతర ఎరువులతో లింక్
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ సీజన్ ఇంకా ఊపందుకోకముందే అన్నదాతలకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వానాకాలం సీజన్‌లో సాధారణ పంటల సాగు 6,08,348 ఎకరాలు కాగా ఇప్పటివరకు 3లక్షలకు పైగా ఎకరాల్లో సాగయ్యాయి. పంటల సాగు దశలకు అనుగుణంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు యూరియా 54,825 మెట్రిక్ టన్నులు, డీఏపీ(డై అమోనియా పాస్ఫేట్) 17,466 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పొటాష్) 13,766 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 58,594 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ(సింగిల్ సూపర్ పాస్ఫేట్)4,484 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాను వినియోగిస్తుండగా, చాలా చోట్ల నెలవారీ లక్ష్యం మేర కేటాయింపులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
యూరియాకు కటకట
జూలైలో 11,593 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో జూలై 5వ తేదీ నాటికి 7వేల మెట్రిక్ టన్నులు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 2,705 మెట్రిక్ టన్నులే వచ్చింది. యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో సొసైటీల్లో పలుకుబడి ఉన్న వారే దక్కించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ప్రైవేట్ మార్కెట్‌లో అధిక ధరలు ఉండటం, ఇతర ఎరువులకు లింక్ పెడుతుండడంతో సహకార సంఘాల్లో పైరవీలు పెరిగాయి.
డీలర్ల మాయాజాలం
ఎరువుల విక్రయాల్లో డీలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఎరువుల కొరత పేరిట బ్లాక్ మార్కెట్‌కు తరలించేలా నిల్వ చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా యూరియా కోసం ఒత్తిడి చేస్తే డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువు కొనాలని చెబుతున్నట్లు తెలిసింది. అంతేకాక 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.50 ఉండగా ప్రాంతాన్ని వారీగా రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. దీనికి తోడు డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువుల బస్తా కొనాల్సి వస్తుండడంతో రైతులు అదనంగా రూ.1,350 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.
ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణ
ప్రస్తుతం మార్క్‌ఫెడ్, డీలర్లు, సొసైటీలు వద్ద 10,110 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది. నానో యూరియా కూడా అందుబాటులోకి వచ్చింది. దీని వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. యూరియా కొరత రాకుండా పర్యవేక్షిస్తూనే డీలర్లు అక్రమాలకు
పాల్పడకుండా తనిఖీలు చేస్తున్నాం.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి