
పంట చేనులోనే పోయిన ప్రాణం
వేంసూరు: వానాకాలం సాగు పనులకు ఉపక్రమించిన రైతు పొలాన్ని సిద్ధం చేసే క్రమాన విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. వేంసూరు మండలం చౌడవరం తండా సమీపాన శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. వేంసూరు కమ్మబజార్‌కు చెందిన చల్లగుండ్ల నాగార్జున(55) శుక్రవారం ఉదయం చౌడవరం తండా సమీపంలో పొలంలో దుక్కి దున్నించేందుకు వెళ్లాడు. అయితే, మధ్యలో విద్యుత్ తీగ అడ్డుగా ఉందని తొలగించే క్రమాన షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు నాగార్జునకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం వేంసూరు కమ్మబజార్‌కు చెందిన రావి నాగేశ్వరరావు మృతి చెందగా, ప్రస్తుతం నాగార్జున మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.
భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
కామేపల్లి: అనుమానంతో భర్త వేధిస్తుండడాన్ని తట్టుకోలేక ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్ప డింది. మండలంలోని బాసిత్‌నగర్‌కు చెందిన తేజావత్ మౌనిక వివాహం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన సపావట్ కృష్ణప్రసాద్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన కృష్ణప్రసాద్ మౌనికను అనుమానిస్తుండడంతో కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మూడేండ్ల కుమారుడు ఉన్నాడు. మౌనిక తండ్రి వీరన్న ఫిర్యాదుతో ఆమె భర్త, అత్త, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
యువతి దూరం పెడుతోందని..
చింతకాని: ప్రేమించిన యువతి కొన్నాళ్లుగా మాట్లాడడం లేదని పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొణిజర్ల మండలం కొండవనమాలకు చెందిన హరికొట్ల శ్రీను(24) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా, ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కొద్దిరోజులుగామాట్లాడకపోవటంతో ఆయన ఈనెల 9వ తేదీ రాత్రి చింతకాని మండలం కొదుమూరు సమీపాన పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని ఆస్పపత్రి సిబ్బందికి చెప్పగా వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందగా, శ్రీను తండ్రి నాగరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
మూడు ఇళ్లలో చొరబడిన దొంగలు
మధిర: ఒకేరోజు రాత్రి మూడు ఇళ్లలో దుండగులు చోరీకి యత్నించగా ఒక స్కూటీ ఎత్తుకెళ్లారు. మధిర మున్సిపల్ పరిధి అంబారుపేటకు చెందిన కర్నాటి కోటి, మణిభూషణం కుటుంబాలు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతా లకు వెళ్లాయి. దీంతో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇళ్ల తాళాలు పగలగొట్టినా విలువైన వస్తువులేమీ లభించక బీరువాల్లో దుస్తులను చిందరవందర చేసి వెళ్లిపోయారని సమాచారం. సమీపంలోని కర్నాటి పెద్ద బుజ్జి ఇంట్లో నిద్రిస్తుండగా ఆరుబయట నిలిపిన స్కూటీని ఎత్తుకెళ్లారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి

పంట చేనులోనే పోయిన ప్రాణం