
కాంగిరేస్‌లో ఎవరెవరో?!
జనాభా ప్రకారం
పదవులు కేటాయించాలి
ఖమ్మంమయూరిసెంటర్: జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవుల్లో మాదిగలకు అవకాశం కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి, కాంగ్రెస్ నాయకుడు వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ కోరారు. ఖమ్మంలో శుక్రవారం వారు ఏఐసీసీ సెక్రటరీ చల్లా వంశీచంద్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా పార్టీ, నామినేటెడ్ జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల్లో మూడింట రెండు వంతులు మాదిగలకు అవకాశం కల్పించడం ద్వారా గత 40ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పార్టీ అధి ష్టానం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వంశీచంద్‌రెడ్డి బదులిచ్చారు.
ఏడేళ్ల తర్వాత..
ఏడేళ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలో సంస్థాగతంగా పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. చివరిగా 2018లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కమిటీలను నియమించారు. ఆ తర్వాత కొందరు మండల అధ్యక్షులు పార్టీ మారగా.. ఇంకొందరు స్తబ్దుగా ఉంటున్నారు. ఇలాంటి స్థానాల్లో ఇన్‌చార్జిలను మాత్రమే నియమించారు. చాలాచోట్ల గ్రామ, బూత్ స్థాయి కమిటీల పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీల భర్తీకి ఉపక్రమించారు.
కసరత్తు షురూ..
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించింది. ఇందుకోసం ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డిని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన రెండు రోజులుగా మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యుల నియామకానికి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుల కోసం ఇద్దరికి తగ్గకుండా పేర్లు స్వీకరిస్తున్నారు. ఆ మండల నేతల నుంచి పేర్లు సేకరిస్తూనే, వ్యక్తిగతంగా ఇచ్చే వారి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రస్థాయి కార్పొరేషన్, ప్రభుత్వ బోర్డుల డైరెక్టర్లు, సభ్యుల నియామకానికి నియోజకవర్గానికి ఇద్దరి పేర్లు సేకరిస్తున్నారు.
15లోగా మండల, జిల్లా కమిటీల ప్రతిపాదనలు
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి పాటుపడిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం పార్టీ కమిటీల్లో చోటు కల్పించేందుకు జిల్లా ఇన్‌చార్జి వంశీచంద్‌రెడ్డి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. శనివారంలోగా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులకు పేర్లను టీపీసీసీ అధ్యక్షుడికి పంపిస్తారు. అలాగే, 15లోగా మండల కాంగ్రెస్, జిల్లా కమిటీ సభ్యుల నియామకాలకు సేకరించిన పేర్లు అందజేయనున్నారు. కాగా, జిల్లా కమిటీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఆశావహుల వివరాలపై శుక్రవారం ఖమ్మం, భద్రాద్రి డీసీసీ అధ్యక్షులు, నేతలు పోట్ల నాగేశ్వరరావు, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఇన్‌చార్జిలతో వంశీచంద్ సమావేశమయ్యారు. అలాగే ఖమ్మం నగర కమిటీపైనా చర్చించారు. అయితే, డీసీసీ అధ్యక్షుడి నియామకానికి మరింత సమయం పట్టనుంది.
అంతటా హడావుడి
సుదీర్ఘకాలం తర్వాత కమిటీల నియామకం జరుగుతుండడంతో పార్టీ శ్రేణుల్లో హడావుడి మొదలైంది. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌నే అంటి పెట్టుకుని ఉన్న వారు పదవుల కోసం నేతలను అభ్యర్థిస్తున్నారు. ఓవైపు మండల, జిల్లా కమిటీలు, మరోవైపు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల నియామకాలతో ఏదో ఓ పదవి వరి స్తుందని ఆశావహులు భావిస్తున్నారు. ఈమేరకు కొందరు తమ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు నేరుగా ఇన్‌చార్జిల వద్దకు వెళ్లి తమ కష్టాన్ని వివరిస్తూ పాల్గొన్న కార్యక్రమాల ఫొటోలు, పత్రికల క్లిపింగ్‌లు అందిస్తున్నారు.
‘స్థానిక’ ఎన్నికల నేపథ్యాన
అధికార పార్టీలో పదవుల పందేరం
బూత్ స్థాయి నుంచి
పార్టీ బలోపేతంపై నజర్
మండల, జిల్లా కమిటీల
నియామకంపై కసరత్తు
రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల భర్తీకీ ప్రతిపాదనలు
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలో బూత్ స్థాయి నుంచి డీసీసీ వరకు పదవుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టారు. అలాగే, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల డైరెక్టర్లు, సభ్యుల నియామకానికి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. త్వరలోనే గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యాన అన్ని స్థాయిల్లో పటిష్టమైన నిర్మాణం ఉండాలనే ఉద్దేశంతో నియామకాలకు శ్రీకారం చుట్టారు.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
వర్గాల వారీగా పోటీ..
మండల పార్టీ అధ్యక్షులుగా, డీసీసీ కమిటీలో స్థానంతో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల కోసం ముఖ్య నేతల అనుచరులు వర్గాల వారీగా పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పదవులు దక్కించుకుని సత్తా చాటాలనుకునే నేతలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మండల అధ్యక్ష పదవి దక్కాలంటే మూడేళ్లు నిర్విరామంగా పార్టీలో పనిచేయాలనే నిబంధన పెట్టారు. అయితే ఎన్నికల ముందు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలోని పలువురు ముఖ్యనేతలు, వారి అనుచరులు.. హస్తం గూటికి చేరారు. ఇలా కాంగ్రెస్‌లో చేరిన ముఖ్య నేతల అనుచరులు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్టానం నిబంధనతో ఎవరికి పదవులు దక్కుతాయన్న చర్చ మొదలైంది.

కాంగిరేస్‌లో ఎవరెవరో?!