
సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యకరం
● వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి ● సేంద్రియ మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
ఖమ్మంవ్యవసాయం: సేంద్రియ ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్యం సొంతమవుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సమీకృత రైతు మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సేంద్రియ మార్కెట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి సేంద్రియ మార్కెట్ ఇదే కాగా, కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రసాయనాలు, పురుగుమందుల స్థానంలో సహజ వనరులను ఉపయోగించి పండించే ఆహార ఉత్పత్తులను అందరికీ అంబాబాటులోకి తీసుకొచ్చేలా మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఎరువులు, పురుగు మందులు తెలంగాణలోనే వినియోగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించినందున రైతులు వినియోగాన్ని తగ్గించేలా అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, కేఎంసీ ఈఈ కృష్ణలాల్, తహసీల్దార్ సైదులుతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, నల్ల మల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మం అర్బన్: ఖమ్మం 55వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షిస్తూ నాణ్యత తగ్గకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
●ఖమ్మంమయూరిసెంటర్: ఏఐసీసీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జి చల్ల వంశీచందర్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో కలిశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ పాల్గొన్నారు.