
కలిసుంటే.. కలదు సుఖం!
ఉమ్మడి కుటుంబం ఐక్యతకు ప్రతీక.. కష్టసుఖాలను పంచుకునే వేదిక. బంధం, అనుబంధం, ప్రేమానురాగాలతో బృందావనాన్ని తలపిస్తుంది. తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, బాబాయిలు, చిన్నమ్మలు, మేనత్తలు, మామలు, అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు, వదినలు, మరదళ్లు, బావలు, బావమరుదులతో ఆనందంగా జీవిస్తుంటారు. పూర్వకాలం నుంచి దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ కాలక్రమంలో మార్పులు వచ్చాయి. స్వేచ్ఛ లేదని, ప్రైవసీ కొరవడుతుందనే భావనతో వేరు కుటుంబాలుగా జీవిస్తుండటంతో దాదాపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోయే దశకు చేరగా.. ఇంకా ఒకటో, రెండో కుటుంబాలు అక్కడక్కడా
ఉమ్మడిగా జీవనం సాగిస్తున్నాయి. ఆ కుటుంబాల గురించి తెలుసుకుందాం. – ఖమ్మంగాంధీచౌక్
● ఉమ్మడి కుటుంబాలతోనే జీవన మాధుర్యం
● కష్టసుఖాల్లో ఒకరికి అందరూ..
అందరికీ ఒకరు
● ప్రేమానురాగాలు,
వ్యవహారిక జ్ఞానం ద్విగుణీకృతం
●మార్గదర్శకం.. కురువెళ్ల కుటుంబం
ఉమ్మడి కుటుంబానికి మార్గదర్శకం కురువెళ్ల కుటుబం అని చెప్పవచ్చు. ఖమ్మం నగరంలో అనాదిగా కురువెళ్ల కుటుంబం వ్యాపార రంగంలో రాణిస్తోంది. కురువెళ్ల వెంకటేశ్వరరావు, మంగతాయారు దంపతులకు ఎనిమిది మంది సంతానం. ఏడుగురు కుమారులు, కూతురు ఉన్నారు. వెంకటేశ్వరరావు 70 ఏళ్ల కిత్రం కమీషన్ మర్చంట్‌గా వ్యాపారం ప్రారంభించి రాణించారు. కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచటంలో మార్గదర్శకంగా నిలిచారు. కుమారులు, కూతురు వేర్వేరు వ్యాపారాలు చేస్తున్నా అందరూ కలిసే ఉంటున్నారు. ఖమ్మం త్రీటౌన్‌లో కురువెళ్ల టవర్స్ పేరిట ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్ నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ ఎనిమిది కుటుంబాలకు 16 మంది సంతానం ఉన్నారు. వీరిలో కొందరు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. ఏ శుభకార్యం జరిగినా అందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.

కలిసుంటే.. కలదు సుఖం!