
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
ఖమ్మంమయూరిసెంటర్: అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం అందజేశారు. ఖమ్మం బుర్హాన్‌పురంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన 13 మందికి చెక్కులు అందజేసి మాట్లాడారు. కార్పొరేటర్లు శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, బీఆర్‌ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, పగడాల నరేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసుల్లో
నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: పలు చోరీ కేసుల్లో నిందితుడైన ఖమ్మం రేవతిసెంటర్‌కు చెందిన దోన్‌వాన్ ప్రేమ్‌కుమార్‌ను ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఆయన జైలుకు వెళ్లివచ్చాడు. అయినా తీరు మార్చుకోక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఖమ్మం మామిళ్లగూడెం, ద్వారకానగర్, వరదయ్యనగర్‌లోని ఇళ్లలోనే కాక వెంకటేశ్వరస్వామి గుడిలో చోరీ చేశాడు. అలాగే, ఏప్రిల్‌లో పటేల్ స్టేడియం వద్ద ఓ వ్యక్తి నుంచి రెండు బంగారు ఉంగరాలను దొంగిలించాడు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రూ.7.50లక్షల విలువైన 155 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని
యువకుడు మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని మద్దులపల్లి వద్ద ఖమ్మం – సూర్యాపేట రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబోజి నవదేవ్(23) మృతి చెందాడు. ఏపీలోని జగ్గయ్యపేట మండలం మల్కాపురానికి చెందిన నవదేవ్, ముదిగొండ మండలం గోకినపల్లికి చెందిన నరేందర్ బైక్‌పై గురువారం కూసుమంచి వైపు నుండి ఖమ్మం వస్తున్నారు. మార్గమధ్యలో మద్దులపల్లి మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నవదేవ్ మృతి చెందగా, నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నవదేవ్ మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
నేలకొండపల్లి: అత్యాచారం కేసులో నిందితుడి కోసం భద్రాద్రి జిల్లా గుండాల పోలీసులు గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురానికి చెందిన కుంభం వీరబాబు 2019లో గుండాల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, కోర్టు వాయిదాలకు హాజరుకావడం లేదు. దీంతో గురువారం గుండాల సీఐ ఎల్.రవీందర్, సిబ్బంది రాజేశ్వపురం వచ్చి ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆగస్టు 13లోగా న్యాయస్థానంలో హాజరయ్యేలా చూడాలని బంధువులకు సూచించారు. కాగా, వీరబాబు ఆచూకీ తెలిసిన వారు 87126 82082, 87126 82084 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ రవీందర్ కోరారు.