
తుది దశకు యూటీ నిర్మాణం
కూసుమంచి: పాలేరు రిజర్వాయర్‌కు సమీపాన సాగర్ ఎడమ కాల్వ యూటీ(అండర్ టన్నెల్) గత ఏడాది వరదలతో కొట్టుకుపోగా కొత్త యూటీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మరో పది రోజుల్లో పనులు పూర్తిచేస్తే సాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవనే భావనతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో పాలేరు రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు నీరు విడుదల చేసే అవకాశమున్నందున ఆలోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కాగా, కాల్వకు 1965లో నిర్మించిన యూటీ గత ఏడాది వరదలకు తెగిపోయింది. దీంతో మరోమారు భారీ వరదలను వచ్చినా తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు జలనవరుల శాఖ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు వివరించారు. ఈమేరకు ఆయన గురువారం పనులను పరిశీలించారు.