
సాగర్ నీటి విడుదలకు కసరత్తు
● రేపటి హైదరాబాద్ సమావేశంలో తేదీ ఖరారయ్యే అవకాశం ● గత ఏడాది కంటే ముందే విడుదల చేస్తారని రైతుల ఆశలు
ఖమ్మంఅర్బన్: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు అయిన నాగార్జునసాగర్ కాల్వలకు జలాల విడుదలపై ఈనెల 11న హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో సృష్టత వచ్చే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు, డ్యామ్‌లోని నీటి నిల్వలు, సాగు అవసరాలపై చర్చించాక తేదీ ఖరారు చేయనున్నట్లు జలవనరుల శాఖ జిల్లా అధికారులు వెల్లడించారు. కాగా, సాగర్ జలాల ఆధారంగా జిల్లాలోని 17 మండలాల్లో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు అర్బన్ పరిధిలో మరో 10వేల ఎకరాల భూమి సాగవుతోంది. ఈమేరకు వరి నాట్లకు సమయం సమీపిస్తున్నందున నీటి అవసరాలపై జిల్లా జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యామ్ నుండి పాలేరు రిజర్వాయర్‌కు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేస్తున్నారు. అయినా పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 23అడుగులకు గాను 15 అడుగుల వరకు మాత్రమే నీరు నిల్వ ఉంది.
ఈనెల రెండో వారంలో...
గతేడాది సాగర్ నుంచి సాగు అవసరాలకు ఆగస్టు 3న నీరు విడుదల చేశారు. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ఈనెల రెండో వారంలోనే నీటి విడుదలకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరా రిజర్వాయర్‌లో కూడా ప్రస్తుతం 16 అడుగుల నీరే ఉంది. అటు పాలేరు, ఇటు వైరా రిజర్వాయర్‌తో పాటు ఇతర జలాశయాల్లో నీటిమట్టం ఆధారంగా సాగర్ నుంచి ముందస్తుగా నీటి విడుదలకు అవకాశముందని ఆయకట్టు రైతులు భావిస్తున్నారు. ఇదే సమయాన సాగర్ కాల్వల పరిధిలో జరుగుతున్న మరమ్మతులను త్వరగా పూర్తిచేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. కూసుమంచి మండలంలో గత ఏడాది భారీ వర్షాలతో కోతకు గురైన యూటీ నిర్మాణ పనులను గత పదిరోజులుగా రాత్రీపగలు తేడా లేకుండా యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేసి ఎలాంటి అడ్డంకి లేకుండా చూస్తామని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు.