
దేవాదాయ శాఖ అర్చక, ఉద్యోగుల నిరసన
ఖమ్మంగాంధీచౌక్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈఓ రమాదేవిపై ఏపీలోని పురుషోత్తమపట్నంలో దాడి చేయడంపై అర్చక, ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈమేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకులు మంగళవారం ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఆలయ భూముల పరిరక్షణకు పాటుపడుతున్న మహిళా అధికారిపై దాడి చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులను చర్యలు తీసుకోవడంతో పాటు దేవాదాయ శాఖ ఉద్యోగులపై దాడులు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో అర్చక, ఉద్యోగ, ఈఓల సంఘాల ప్రతినిధులు దాములూరి వీరభద్రరావు, వీ.వీ.నర్సింహారావు, చుండూరు రామకోటేశ్వరరావు, ఆనంద్, దాములూరి కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.