
పత్తి మొలకలు అంతంతే..
● వర్షాభావ పరిస్థితుల్లో తగ్గిన మొలక శాతం ● పలు ప్రాంతాల్లో రెండోసారి విత్తనాలు నాటుతున్న రైతులు ● ఫలితంగా పెరగనున్న పెట్టుబడి భారం
ఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాలు అనుకూలించకపోవడంతో పత్తి మొలక శాతం తగ్గింది. ఫలితంగా మొలకెత్తని చోట రైతులు రెండోసారి విత్తనాలు పెడుతున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో పత్తి సాగు లక్ష్యం చేరలేదు. జిల్లాలో ఈ ఏడాది 2,20,550 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 1,78,171 ఎకరాల్లోనే విత్తనాలు నాటినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగవుతుంది. ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండటంతో రైతులు మెట్ట పంటగా పత్తి సాగుకు ప్రాధాన్యత ఇస్తారు.
మరోమారు...
జూన్ వర్షపాతం 131.2 మి.మీ.కు గాను 123.9 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈ వర్షం కూడా జూన్ 29, 30వ తేదీల్లోనే కురిసింది. ఈ ప్రభావం పత్తిసాగుపై పడింది. ఇక జూన్ చివరి రెండు రోజు లు, జూలై మొదటి రెండు రోజులు మంచి వర్షాలు కురవడంతో మొలకెత్తిన పత్తికి ప్రాణం పోయగా, మొలక రాని చోట మరోసారి విత్తనాలు పెట్టేందుకు దోహదపడ్డాయి. దీంతో చాలాచోట్ల రైతులు అరకొరగా ఉన్న పత్తి మొక్కలను తొలగించి రెండోసారి విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కారణంగా విత్తనాలు, దుక్కి దున్నడం, పాటు చేయటం, కూలీల ఖర్చులు కలిపి అదనంగా ఎకరాకు మరో రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు వెచ్చించాల్సి వచ్చింది.
ఈనెల మూడో వారం వరకు అవకాశం
పత్తి విత్తనాలు నాటేందుకు ఈనెల మూడో వారం వరకు అవకాశముందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.78 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈనెల 20వ తేదీ నాటికి లక్ష్యం చేరే అవకాశముందని భావిస్తున్నారు. తొలుత జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 6,61,662 విత్తన ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకురాగా, రైతులు రెండోసారి కొనుగోలు చేస్తుండడంతో అదనంగా 8,697 విత్తన ప్యాకెట్లు సమకూర్చారు. ఇవికాక మరో లక్ష విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
అనుకూలించని వానలు
పత్తి పంట విత్తేందుకు ఈ ఏడాది వానలు అనుకూలించలేదు. సీజన్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతులు ఆశగా సాగుకు ముందడుగు వేసినా ఆతర్వాత రుతుపవనాల ప్రభా వం మందగించింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 8 తర్వాత తెలుగు రాష్ట్రాలను తాకుతాయి. ఈసారి మాత్రం మే నెల 25నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఈమేరకు మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటగా... కొందరు పొడి దుక్కుల్లోనే విత్తనాలు పెట్టారు. ఆతర్వాత జూన్ మూడో వారం వరకు వానలు ముఖం చాటేయడం.. పత్తి విత్తాక 15 – 20 రోజులు వర్షం లేకపోవడంతో మొలకశాతం పడిపోయింది.
రెండుసార్లు విత్తా..
రెండెకరాల్లో పత్తి నాటాను. వర్షాలు లేక మొలకలు రాలేదు. దాదాపు 50 శాతం మొలకెత్తకపోవటంతో మరోమారు విత్తనాలు నాటాం. వానలు సక్రమంగా కురిస్తేనే ఈ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంది.
– బత్తుల ప్రసాద్, పండితాపురం, కామేపల్లి మండలం
లక్ష్యం దిశగా పత్తి సాగు
జిల్లాలో పత్తి సాగు లక్ష్యం దిశగా సాగుతోంది. వానలు అనుకూలించక అక్కడక్కడా రెండోసారి విత్తుతున్నారు. ఈనెల మూడోవారం వరకు నాటే అవకాశముంది. పూర్తి పదునులోనే విత్తనాలు నాటితే ఫలితముంటుంది.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

పత్తి మొలకలు అంతంతే..

పత్తి మొలకలు అంతంతే..