
ప్రైవేట్ పాఠశాలలో నోట్‌పుస్తకాలు సీజ్
ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని సెయింట్ విన్సెంట్ పాఠశాల యాజ మాన్యం పాఠశాల పేరిట నోట్ పుస్తకాలు ముద్రించి విద్యార్థులు విక్రయిస్తుండటంతో మంగళవారం ఎంఈఓ బి.మురళీమోహన్‌రావు సీజ్ చేశారు. పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారంతో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టి ఎంఈఓకు సమాచారం ఇచ్చారు. దీంతో తనిఖీ చేసి పుస్తకాలు నిల్వ చేసిన గదిని సీజ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు ఉగ్గం సురేష్ పాల్గొన్నారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
కల్లూరు: మండలంలోని మర్లపాడుకు చెందిన కమ్మకంటి వెంకటి(35) పాముకాటుతో మృతి చెందాడు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే ఆయన మంగళవారం పొలంలో పనిచేస్తుండగా కాలిపై పాముకాటు వేసింది. దీంతో కుటుంబీకులు కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వెంకటికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రెండేళ్ల బాలుడికి పాముకాటు
కరకగూడెం: ఓ మహిళ పొలం పనులకు వెళ్తూ తన రెండేళ్ల మనవడిని వెంటబెట్టుకెళ్లగా ఆ చిన్నారిని పాముకాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఊకే సారయ్య – నాగమణి దంపతుల కుమారుడు విక్రం ఆదిత్యను మంగళవారం ఆయన నాయనమ్మ పొలం పనులకు తీసుకెళ్లింది. సమీపాన బాబును పడుకోబెట్టి ఆమె పనుల్లో నిమగ్నం కాగా చిన్నారిని పాము కాటు వేయడంతో నురగలు కక్కుతూ స్పృహకోల్పోయాడు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.