
పత్తి కొనుగోళ్లలో కొత్త విధానానికి ఓకే..
ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న పీడీపీఎస్(ప్రైస్ డిఫరెన్స్ పేమెంట్ పథకం)ను స్వాగతిస్తున్నామని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు తెలిపారు. ఖమ్మంలోని వర్తక సంఘం భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో చాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు మన్నెం కృష్ణ, తల్లాడ రమేష్, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్‌రావు మాట్లాడారు. పత్తి కొనుగోళ్లలో పీడీపీఎస్ విధానాన్ని ఖమ్మం మార్కెట్‌లోనూ అమలుచేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విధానంతో రైతులకు మేలు జరగనున్నందున అమలుకోసం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.