ఇంకా అందని యూనిఫామ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంకా అందని యూనిఫామ్‌

Jul 8 2025 5:16 AM | Updated on Jul 8 2025 5:16 AM

ఇంకా

ఇంకా అందని యూనిఫామ్‌

ఎర్రుపాలెం: విద్యార్థులు అంతా సమానమేనన్న భావనతో ఉండేలా ప్రభుత్వం యూనిఫామ్‌ పంపిణీ చేస్తోంది. కానీ ఆచరణలో ఇది సాఫీగా సాగడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల కావొస్తున్నా చాలా మంది విద్యార్థులకు ఒకే జత యూనిఫాం అందగా.. ఇంకొందరికి అది కూడా పంపిణీ చేయకపోవడంతో ఒక్కో పాఠశాలలో విద్యార్థులు కొందరు యూనిఫామ్‌తో, ఇంకొందరు సాధారణ దుస్తుల్లో హాజరవుతున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు 1,269 ఉండగా, వీటిలో 69,241 మంది చదువుతున్నారు. వీరందరికీ రెండు జతల యూనిఫామ్‌ అందించేలా క్లాత్‌ను మండలాలకు సరఫరా చేశారు. ఇప్పటివరకు జిల్లాలోని 66,868 మందికి ఒకే జత యూని ఫామ్‌ పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఉతికితేనే యూనిఫామ్‌

జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు ఒక జత యూనిఫామ్‌ కూడా నేటికీ అందలేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల 7నుంచి 10వ తరగతుల వారికి ఒక జత అందించగా, ఆరో తరగతి విద్యార్థులకు అదీ పంపిణీ చేయలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 3వేల మందికి పైగా విద్యార్థులు ఆరో తరగతిలో కొత్తగా చేరినట్లు అంచనా. కొలతలు తీసుకోలేదని చెబుతూ వీరికి యూనిఫామ్‌ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ఒకటే జత అందుకున్న విద్యార్థులు ఏ రోజుకారోజు ఉతికితేనే తెల్లారి పాఠశాలలకు యూనిఫామ్‌తో వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నగదు తక్కువ కావడంతో..

యూనిఫామ్‌ కుట్టించే బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. సమాఖ్యల్లోని సభ్యులకు టైలరింగ్‌ వస్తే యూనిఫామ్‌ సొంతంగా కుడుతున్నారు. ఆ పరిస్థితి లేని చోట స్థానిక టైలర్లతో కుట్టిస్తున్నారు. ఒక జత యూనిఫామ్‌ కుట్టినందుకు ప్రభుత్వం రూ.70 చెల్లిస్తుండడంతో ఆ నగదు సరిపోదనే భావనతో టైలర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా రెండో జత యూనిఫామ్‌ పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇకనైనా మండలస్థాయి కమిటీల్లో సభ్యులైన తహసీల్దార్‌, ఎంఈఓ, ఐకేపీ ఏపీఎంలు దృష్టి సారిస్తేనే సమస్యకు పరిష్కారం లభించనుంది.

ఒకరికే యూనిఫామ్‌

మా ఇద్దరు కుమారులు మీనవోలు స్కూల్‌లో ఏడు, ఆరో తరగతి చదువుతున్నారు. ఏడో తరగతి చదివే కుమారుడికి ఒక జత యూనిఫామ్‌ ఇవ్వగా, చిన్నకుమారుడికి అసలే ఇవ్వలేదు. దీంతో నాకెందుకు ఇవ్వలేదని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం.

– గుర్రాల వెంకటేశ్వరరెడ్డి,

జెడ్పీ పాఠశాల పేరంట్‌, మీనవోలు

మా స్కూల్‌కు యూనిఫాం రాలేదు..

మా పాఠశాలలోని 70 మంది విద్యార్థులకు ఒక జత కూడా యూనిఫామ్‌ రాలేదు.

మహిళా సమాఖ్యలో అడిగితే కుట్టడం కాలేదని చెప్పారు. దీంతో యూనిఫామ్‌ కోసం తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులకు

దృష్టికి తీసుకెళ్లాం.

– జంగా గురునాధరెడ్డి, పీఎస్‌(బీసీ కాలనీ)

హెచ్‌ఎం, బనిగండ్లపాడు

15న నాటికి రెండో జత

జిల్లాలోని విద్యార్థులందరికీ 15వ తేదీ నాటికి రెండో జత యూనిఫామ్‌ ఇస్తాం. ఇప్పటికే యూనిఫామ్‌ కుట్టడం 30శాతం పూర్తయింది. ఈ ఏడాది ఆరో తరగతిలో చేరిన విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నాం. వీరికి కూడా త్వరలోనే పంపిణీ చేస్తాం.

– సామినేని సత్యనారాయణ, డీఈఓ

7–10వ తరగతి విద్యార్థులకు ఒకటే జత పంపిణీ

ఆరో తరగతి విద్యార్థులకు అదీ అందని వైనం

ఇంకా అందని యూనిఫామ్‌1
1/3

ఇంకా అందని యూనిఫామ్‌

ఇంకా అందని యూనిఫామ్‌2
2/3

ఇంకా అందని యూనిఫామ్‌

ఇంకా అందని యూనిఫామ్‌3
3/3

ఇంకా అందని యూనిఫామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement