
ప్రజావాణిపై విశ్వాసం పెరగాలి..
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా ప్రజావాణి(గ్రీవెన్స్ డే)పై విశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 జనవరి నుండి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న185 దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలన్నారు. అలాగే, జిల్లా అధికారులు ప్రతీ వారం మండలాల వారీగా ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం అర్బన్ మండలం వినోబా(నవోదయ) కాలనీలో కోర్టు ఉత్తర్వుల మేరకు తాగునీరు, కరెంట్ వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే, గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలో వైరా మండలం గండగలపాడు వద్ద సర్వీస్ రోడ్డు ఏర్పాటుచేయాలని, హైవే నిర్మాణంతో దెబ్బతిన్న సాగునీటి కాల్వలను పునరుద్ధరించాలని తెలంగాణ రైతు సంఘఽం నాయకులతో కలిసి రైతులు వినతిపత్రం అందజేశారు. ఇవి కాక ఇంకొన్ని అంశాలు వినతిపత్రాలు, ఫిర్యాదులు అందాయి.
ఓపెన్ స్కూల్ బుక్‌లెట్ల ఆవిష్కరణ
తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన బుక్‌లెట్లను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆవిష్కరించారు. ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు, వయోజన విద్య డీడీ అనిల్, డీఈఓ కార్యాలయ ఉద్యోగి చావా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే, ప్రైవేట్ కాలేజీలో ఫార్మసీ చదువుతున్న వేగినాటి దీపిక ఫీజు కోసం హెల్పింగ్ హాండ్స్ సంస్థ సభ్యుడు మద్దినేని ప్రసాదరావు కమల సమకూర్చిన రూ.35 వేల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో యలమద్ది వెంకటేశ్వర్లు, సిరిపురపు రమణారావు, కొంగర పురుషోత్తమరావు, ఏపూరి నాగేశ్వరరావు, మద్దినేని కమల తదితరులు పాల్గొన్నారు.
పైలట్‌గా 15 పాఠశాలలు
జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించిన ఆయన 15 పాఠశాలలను ఎంపిక చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలన్నారు. ఇందుకోసం రూ.12 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇక మధిరలో జీ+2 విధానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అక్కడ 13 ఎకరాల స్థలంలో 427 ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు.