
గురుకులాల్లో వసతుల కల్పనకు చర్యలు
ఖమ్మంమయూరిసెంటర్: రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దానవాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులంలో రూ.1.50 కోట్లతో చేపడుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రహరీ నిర్మాణంతో పాటు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. ఇంకా చేపట్టాల్సిన మరమ్మతు పనులపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. డైనింగ్ హాల్‌లో టేబుళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత బి.ఆర్.అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికలు)లో రూ.10 లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో చదువుకుని ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, జిల్లా నుంచి కూడా గొప్ప ఫలితాలు సాధించేలా విద్యార్థులను ఉత్తేజపరచాలని అన్నారు. అనంతరం కోయచలక క్రాస్ రోడ్డు వద్ద గల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులు నిత్యం చదువుతో పాటు కొంత సమయం క్రీడలకు కేటాయించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాత్మా జ్యోతి బా పూలే విద్యాలయంలో వీధిదీపాలు, తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి స్వరూపా రాణి, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి డాక్టర్ పురంధర్, ప్రిన్సిపాళ్లు విజయదుర్గా, శైలజ, రాజ్యలక్ష్మి, ఆర్‌ఎల్‌సీ అరుణకుమారి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి