
నిరుపయోగంగా డంపింగ్ యార్డులు
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో తడి, పొడి చెత్త డంపింగ్‌కు ఏర్పాటుచేసిన యార్డులు నిరుపయోగంగా మారాయి. మడుపల్లి సమీపంలో చెరువు లోతట్టు ప్రాంతంలో షెడ్లు నిర్మించగా.. ప్లాస్టిక్ వస్తువులను వేరు చేసే షెడ్డు రేకులు ధ్వంసమయ్యాయి. ఈ షెడ్డు షట్టర్ తీయక నెలలు దాటుతుండడంతో అన్ని వ్యర్థాలను డంపింగ్ యార్డ్ సమీపాన ఆరుబయటే వేస్తున్నారు. అలాగే, యార్డ్‌లో కంపోస్ట్ ఎరువు తయారీకి చేసిన ఏర్పాట్లు కూడా నిరుపయోగంగా మారాయి. వారం, పదిరోజులకోసారి పట్టణంలో సేకరించే తడి, పొడి చెత్త కలిపి 1.50టన్నులు అవుతుండగా.. ప్రతిరోజు సేకరిస్తే కనీసం 3 టన్నులకు చేరే అవకాశం ఉంది. అంతా కలిపి కాకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్ యార్డుకు తరలించి కంపోస్టు ఎరువు తయారీకి అవకాశమున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.