
రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా కార్యాచరణ
నేర సమీక్ష సమావేశంలో సీపీ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా కార్యాచరణ రూపొందించాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మంలో సోమవారం జరిగిన నేరసమీక్ష సమావేశంలో ఆయన స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, దర్యాప్తుపై ఆరాతీశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వైరా, కల్లూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన బ్లాక్‌స్పాట్ల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, బ్లింకింగ్ లైట్ల ఏర్పాటుతో ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే, మితిమీరిన వేగం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిని గుర్తించేలా నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. కాగా, అమాయక ప్రజలు అవసరాలను ఆసరాగా చేసుకుని చీటీలు నడిపే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, దొంగతనాల నివారణ, గంజాయి సరఫరా, అమ్మకాలు జరగకుండా బందోబస్తు పెంచాలని సీపీ ఆదేశించారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్‌రావు, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, రఘు, రవి, సర్వర్, సుశీల్‌సింగ్, నర్సయ్య పాల్గొన్నారు. కాగా, జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ సోమవారం ఉద్యోగ విరమణ చేసిన వారిని సీపీ సన్మానించారు, ఏఆర్ ఏసీపీలు సుశీల్‌సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.