ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
● సామాజిక మాధ్యమాల్లోనూ స్వీకరించాలి ● గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణికి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అంతేకాక ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తూ పరిష్కారంపై దృష్టి సారించాలని తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి (గీవెన్స్ డే)లో భాగంగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సోమవారం ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, అది సాధ్యం కాకపోతే కారణాలను దరఖాస్తుదారులకు చెప్పాలని సూచించారు. అలాగే, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు దరఖాస్తుల పరిష్కారాన్ని ఆన్‌లైన్ ద్వారా పరిశీలిస్తూ మండల అధికారులకు సూచనలు చేయాలని చెప్పారు. డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్‌ను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● వేంసూర్ మండలం బీరపల్లి వాసులు ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని నిలిపివేయించాలని కోరారు.
● ఖమ్మం శ్రీరామ్ హిల్స్‌కు చెందిన వనమా ఉషారాణి ధంసలాపురం సర్వే నంబర్ 194లో రెండెకరాల వ్యవసాయ భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. తన భూమిపై ఇతరులకు జారీ చేసి పట్టా పాస్ పుస్తకాన్ని రద్దు చేయాలని కోరారు.
● ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన సునీత డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పించాలని విన్నవించారు.
● తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ కే.వీ.కృష్ణారావు కోరారు. తొలి, మలి దశ ఉద్యమకారులతో కలిసి కలెక్టర్ వినతిపత్రం అందించారు.
వారంలోగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక
ఖమ్మంగాంధీచౌక్: పేదల సొంతింటి ఆకాంక్ష నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల సంఖ్యకు అనుగుణంగా ఇందిరమ్మ కమిటీల నుంచి జాబి తాలు తీసుకున్నాక మరోమారు పరిశీలించి పారదర్శకంగా వారంలోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. అలాగే, పంపిణీ చేయకుండా మిగిలిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయడంతో పాటు మిగిలిపోయిన నిర్మాణాలపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, డీఎల్‌పీఓ రాంబాబు, ఆర్డీఓలు జి.నరసింహరావు, ఎల్.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సారొస్తేనే ఇస్తాం..
ఇటీవలే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ తొలిసారి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి హాజరయ్యారు. అయితే, కలెక్టర్ ఉదయమే మంత్రి పొంగులేటి పర్యటనకు వెళ్లగా, అప్పటికే అదనపు కలెక్టర్లు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభించారు. కానీ చాలా మంది కలెక్టరేట్ ఆవరణలోనే వేచి ఉండి, కలెక్టర్ అనుదీప్ వచ్చాకే దరఖాస్తులు ఇవ్వడం కనిపించింది.
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి


