ఈజీ మనీ.. వెదజల్లారా?!
సత్తుపల్లి: సైబర్ నేరాలతో అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగిన ఓ ముఠా బాధ్యులు ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఎలాగైనా తమ వారికి పదవి దక్కేలా పావులు కదుపుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు డబ్బు సర్దుబాటు చేశారనే చర్చ జరుగుతోంది. ఫలితం తారుమారయ్యేలా విచ్చలవిడిగా డబ్బు ఎరవేశారని.. ప్రత్యర్థులకు బలమైన మద్దతు ఉన్న వ్యక్తులను గుర్తించి ఓటుకు రూ.10వేలు మొదలు నుంచి రూ.15వేల వరకు అందించారని సమాచారం. అయితే, ఈ వ్యవహారాన్ని తాము ఆలస్యంగా గుర్తించామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బాధిత అభ్యర్థులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పథకం ప్రకారం..
ఎన్నికల ముందు సర్పంచ్ పదవే లక్ష్యంగా కొందరు వ్యూహరచన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో ముఖ్యనేతలకు సన్నిహితంగా ఉండే సర్పంచ్ అభ్యర్థులను ఓడించేందుకు వ్యూహాత్మకంగానే వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల అధికార పార్టీ రెబల్‌గా పోటీ చేసిన వారికి సైతం ఆర్థికంగా సహకరిస్తామనే భరోసా ఇవ్వడంతోనే ఉపసంహరణకు అంగీకరించలేదని పలువురి పేర్లతో మంత్రికి వివరిస్తున్నట్లు తెలిసింది. సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో ‘ఈజీ మనీ’ ఈ తరహా ఎత్తుగడలు అమలుచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, డబ్బుకు దాసోహమైన వారిలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. విచ్చలవిడిగా వస్తున్న డబ్బును ఓటర్లకు అందించడం, వీరికి సైబర్ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు అండగా నిలవడంతో ఆర్థికంగా అండ లేని తాము ఓడిపోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి పాత్ర ఎంత?
సత్తుపల్లి నియోజకవర్గంలో కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.కోటికి పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, వీరికి హవాలా, సైబర్ నేరగాళ్ల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఓడిపోయిన కొందరు మంత్రి తుమ్మలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నిఘా వర్గాలు రంగంలోకి దిగి అభ్యర్థుల వారీగా ఎంత ఖర్చు చేశారు, వారికి నగదు ఎలా అందిందనే వివరాలు ఆరా తీసే పనిలో పడ్డాయి. ఫలితంగా ఎన్నికల్లో డబ్బు రవాణాకు సహకరించిన వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
ఈజీ మనీ.. వెదజల్లారా?!


