డీసీసీబీ, పీఏసీఎస్‌ల పాలకవర్గాలు రద్దు
● డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా కలెక్టర్ ● పీఏసీఎస్‌లకు అధికారులతో కమిటీల నియామకం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) పాలక వర్గాలను రద్దుచేస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గాల స్థానంలో పర్సన్ ఇన్‌చార్జిలతో కూడిన అధికారుల కమిటీని నియమించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దొండపాటి వెంకటేశ్వరరావు చైర్మన్‌గా కొనసాగుతున్న పాలకవర్గం రద్దయింది. ఈ స్థానంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని పర్సన్ ఇన్‌చార్జిగా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య అధికారులు పాల్గొన్నారు.
పీఏసీఎస్‌లకు అధికారుల కమిటీలు
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీలను నియమించాలని సహకార శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా ఖమ్మం డీసీసీబీ పరిధిలోని ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రెండు చొప్పున పీఏసీఎస్‌ల పాలకవర్గాలు రద్దయ్యాయి. ఈ స్థానంలో సహకార శాఖకు చెందిన అధికారి, సహకార సంఘానికి చెందిన సూపర్‌వైజర్, సంఘం పరిధిలోని డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌తో కమిటీని నియమిస్తారు.
ఆరు నెలలు లేదా ఎన్నికల వరకు...
డీసీసీబీ, పీఏసీఎస్‌లకు నియమించే పర్సన్ ఇన్‌చార్జిలు, కమిటీలు ఆరు నెలల పాటు లేదా సంఘాలకు ఎన్నిక జరిగే వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం రద్దయిన కమిటీలు 2020 ఫిబ్రవరిలో నియామకమయ్యాయి. కమిటీల పదవీ కాలం పూర్తయ్యాక రైతులకు ప్రయోజనం కలిగేలా విడదీసి కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కాల పరిమితిని పొడిగించింది.


